జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాలకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ దాన్మార్లోని అలందార్ కాలనీలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది.. ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ప్రాంతంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు 78 మంది..
శుక్రవారం చనిపోయిన ఈ ఇద్దరు ఉగ్రవాదులతో కలిపి.. జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 78 మంది ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.