Bajrang Dal activist murder case: కర్ణాటక శివమొగ్గలో ఉద్రిక్తతలకు దారితీసిన బజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం వరకు 144 సెక్షన్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా కేంద్రంలోని రెండు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కూడా విచారణకు అదేశించారు ఆ రాష్ట్ర హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర. శివమొగ్గలోని కోటే, దొడ్డపేట పోలీస్ స్టేషన్ల పనితీరుపై విచారణ చేపట్టాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ రెండు పోలీస్ స్టేషన్లలో గత ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎంత మంది ఉన్నారు, వారు నిందితుల పట్ల తీసుకున్న చర్యలపై సమీక్షించాల్సి ఉంటుందని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారి వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వారు గతంలో భారీగానే నేరాలకు పాల్పడినట్లు తెలిపారు.
హర్ష హత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు శివమొగ్గ పోలీసు సూపరింటెండెంట్ బీఎమ్ లక్ష్మీ ప్రసాద్ మంగళవారం తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మరికొంతమందిని విచారిస్తున్నామని వివరించారు.