Two Dogs Fighting Man Fire : మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో రెండు పెంపుడు శునకాల మధ్య జరిగిన గొడవకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంక్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి కాల్పులు జరపడం వల్ల ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణబాగ్ కాలనీలో నివాసం ఉంటున్న రాజ్‌పాల్ రజావత్.. స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు తన పెంపుడు కుక్కను తీసుకుని గురువారం రాత్రి 11 గంటల సమయంలో.. వాకింగ్‌కు వెళ్లాడు. అదే సమయంలో అతడి శునకం.. పొరిగింటి వారికుక్కతో ఘర్షణకు దిగింది. ఇది గమనించిన రజావత్.. పొరిగింటి కుక్కను పెంచుతున్న వ్యక్తిపై మండిపడ్డాడు. దీంతో వారి మధ్య ఘర్షణ తలెత్తింది. క్షణాల్లోనే అక్కడ జనం గుమిగూడారు.
ఆ తర్వాత రజావత్.. తన కుక్కను తీసుకుని ఇంటికి వెళ్లపోయాడు. ఇంటి మొదటి అంతస్తు బాల్కనీకి వెళ్లి లైసెన్స్‌డ్ గన్‌తో రోడ్డుపై ఉన్నవారిపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో విమల్ (35), రాహుల్ వర్మ (28) అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను శవపరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం రజావత్‌ను అరెస్టు చేశారు. అతడి వద్ద ఉన్న డబుల్ బ్యారెల్ 12 బోర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనలో మరణించిన రాహుల్, విమల్.. సొంత బావాబావమరుదులు అని అదనపు డీసీపీ అమరేంద్ర సింగ్ తెలిపారు. రాహుల్ అదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ కార్యాలయంలో జాబ్ చేస్తున్నట్లు తెలిపారు. వీరి రజావత్ ఇంటి ఎదురుగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. అయితే రజావత్‌కు అతడి పొరిగింటి వారికి.. పెంపుడు కుక్క విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు.