Tomato Price Hike : లాటరీ తగిలి కోటీశ్వరుడిగా మారాడని చాలా సార్లు వినే ఉంటాం. పంట సాగు చేసి ఒక్క నెలలోనే కోటీశ్వరుడిగా మారిన రైతు గురించి విన్నారా? కేవలం నెల రోజుల్లో 13,000 పెట్టెల టమాటాలను విక్రయించి కోటీశ్వరుడిగా మారిపోయాడు పుణెకు చెందిన ఓ రైతు. ఆయన కథేంటో తెలుసుకుందాం..
Tomato Price Pune : మహారాష్ట్ర పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్కు 18 ఎకరాల భూమి ఉంది. ఇందులో 12 ఎకరాల్లో టమాటాలు.. మిగిలిన 6 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నాడు. టమాటాల సాగులో సరైన అవగాహన ఉండడం వల్ల దిగుబడి బాగా వచ్చింది. దీంతో ఒక్క నెలలో 13,000 పెట్టెల టమాటాలను విక్రయించి కోటీశ్వరుడయ్యాడు. నెల రోజుల్లోనే అతడికి దాదాపు రూ.కోటిన్నరకు పైగా ఆదాయం వచ్చింది. ఒక పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్ మార్కెట్లో విక్రయించాడు తుకారాం. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెల టమాటాలను అమ్మి రూ. 18 లక్షలు సంపాదించాడు.
తుకారాంకు అతడి కుమారుడు ఈశ్వర్ గాయకర్తో పాటు కోడలు సోనాలి సైతం సాయం చేసేవారు. సోనాలి.. విత్తనాలు నాటడం నుంచి ప్యాకేజింగ్ వరకు చూసుకోగా.. మార్కెట్‌కు తరలించడంలో ఈశ్వర్ సాయపడేవాడు. నారాయణ్‌గంజ్‌లోని ఝున్ను వ్యవసాయం మార్కెట్లో కిలో టమాటా ధర రూ.125 పలుకుతోంది. 20 కిలోల డబ్బా రూ.2,500కు అమ్ముతున్నారు.