లఖింపుర్ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని కాంగ్రెస్‌నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కాంగ్రెస్ నేతలు లఖింపుర్ ఖేరి జిల్లాకు తరలివచ్చారన్నారు. లఖింపుర్ ఘటనలో (Lakhimpur Kheri Incident) మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. అనంతరం మీడియాతో మాట్లాడారు.
" మృతిచెందినవారి పోస్ట్ మార్టమ్ రిపోర్టులపై బాధిత కుటుంబాలు సంతృప్తిగా లేవు. వారికి సత్వర న్యాయం కావాలి. ఈ ఘటనకు కారకులైనది ఎవరో అందరికీ తెలుసు."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
తాము కలిసిన మూడు కుటుంబాలకు న్యాయం జరగాలన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.
" వారికి పరిహారంపై ఆందోళన లేదు. వారికి న్యాయం జరగాలి. కేంద్రమంత్రి రాజీనామా చేస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరగుతుంది. కేంద్రమంత్రి కుమారుడు కచ్చితంగా అరెస్ట్ కావాలి. ఎఫ్ఐఆర్ లేకుండానే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కానీ క్రిమినల్స్‌ను అలా ఎందుకు అరెస్ట్ చేయరు?"
-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌నేత
వీరి వెంట పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌తో పాటు కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, కేసీ వేణుగోపాల్, దీపీందర్ సింగ్ హుడా ఉన్నారు. మరికొంతమంది రైతు కుటుంబాలను గురువారం పరామర్శించనున్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక.
లఖింపుర్ హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును గురువారం విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి:లఖింపుర్ ఖేరిలో రాహుల్, ప్రియాంక.. బాధిత కుటుంబాలకు పరామర్శ