Tirumala srivari Navaratri Brahmotsavam 2023 Arrangements : సప్తగిరీశుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. నేడు ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరగనుంది. అధిక మాసం కారణంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహిస్తోంది. ఇప్పటికే సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించింది. నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా విజయవంతం చేయాలని అధికారులు లక్షలాదిగా తరలి వచ్చేభక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఊహించిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో దసరా సెలవుల నైపధ్యంలో భారీగా భక్తులు తరలివస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని నవరాత్రి బ్రహ్మోత్సవాలకు తిరుమల క్షేత్రం సిద్దం అయింది. నేడు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంను అర్చకులు వైభవంగా నిర్వహించనున్నారు. స్వామివారి సేనాదిపతులైన విష్వక్కేనుల వారు ఆలయం నుంచి ప్రదక్షణగా తిరువీధుల్లో ఊరేగుతూ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో అంకురార్పణకు కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పిస్తారు.
Tirumala Navaratri Brahmotsavam from October 15 to 23 : అనంతరం రేపు రాత్రి 7 గంటలకు పెద్ద శేషవాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గరుడ వాహన సేవ 19వ తారీఖున జరగనుంది. బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు ఈ నెల 23వ తారీఖున శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నాన మహోత్సవం జరుగుతుంది.
తిరుమలలో రేపటి నుండి 23వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంభందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ధర్మారెడ్డి వెల్లడించారు. అధికమాసం రావడంతో ఈ ఏడాది స్వామివారి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడవాహన సేవ 19వ తేదీ జరగనుందని..అలాగే 20వ తేదీ సాయంత్రం పుష్పకవిమానం, అక్టోబరు 22న స్వర్ణరథం, 23న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో తెలిపారు.