మధ్యప్రదేశ్ ఇందోర్‌లో దారుణం జరిగింది. పాఠశాలకు బంక్ కొట్టి అష్ట పట్టణం నుంచి ఇందోర్ వెళ్లిన ముగ్గురు బాలికలు విషం తాగారు. ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందగా.. మరొక బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఇందోర్‌లోని ఓ పార్కులో విషం తాగారు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికలను ఆస్పత్రికి తరలించి.. వాంగ్మూలాన్ని తీసుకున్నారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ముగ్గురు బాలికలు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. వారంతా పాఠశాలకు వెళతామని ఇళ్ల నుంచి బయలుదేరి బస్సులో ఇందోర్ చేరుకున్నారు. ఓ బాలిక తన ప్రియుడు ప్రేమను నిరాకరించాడని ఆత్మహత్యకు పాల్పడగా.. మరో బాలిక కుటుంబ కలహాలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మూడో బాలిక వీరిద్దరూ విషం తాగడం వల్ల ఆమె కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు.
భార్య, అత్తపై పెట్రోల్ పోసి..
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్ సహారన్‌పుర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిద్రిస్తున్న తన భార్య, అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిందితుడి అత్త ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడి భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిందితుడు నితిన్‌కు కూడా మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. ఈ ఘటన శనివారం వేకువజామున జరిగింది.