తమిళనాడులోని తెన్‌కాశీలో ముగ్గురు వ్యక్తులపై దాడి చేసిన ఓ ఎలుగుబంటి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది. దాడికి దిగిన ఎలుగుబంటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు మత్తుమందు ప్రయోగించారు. ఈ క్రమంలోనే భల్లూకం ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. మరోవైపు, ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఇద్దరి ముఖాలకు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు.
శివశైలంతో పాటు కడయంలోని పలు ప్రాంతాల్లో రాత్రి సమయంలో క్రూర మృగాలు సంచరిస్తుంటాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చి దాడి చేసినట్లు చెప్పారు. స్థానికుల వివరాల ప్రకారం.. వైకుంఠమణీ అనే ఓ వ్యాపారీ ఆదివారం ఉదయం కూరగాయలు అమ్మేందుకు తెన్‌కాశీలో నడుస్తూ వెళ్తుండగా.. అదే సమయంలో ఓ ఎలుగు బంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వ్యాపారి కేకలు విన్న అతని సోదరుడు.. మరికొంత మంది స్థానికులతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
అయితే ఎలుగుబంటితో పోరాడేందుకు వారివద్ద ఎటువంటి ఆయుధాలు లేనందున అది వారిపైన కూడా దాడి చేసింది. ఈ దాడిలో వ్యాపారితో పాటు శైలప్పన్, నాగేంద్రన్ అనే మరో ఇద్దరు సైతం గాయపడ్డారు. దాడి చేశాక ఆ ఎలుగుబంటి అడవిలోకి వెళ్లిపోయింది. గాయపడ్డ ముగ్గురుని స్థానికులు తిరునల్వేలీలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరి ముఖాలు తీవ్రంగా గాయపడటం వల్ల వైద్యులు వారికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు.