అసోంలోని బరాక్ వ్యాలీలో శక్తిమంతమైన కుటుంబంగా పేరొందిన గౌతమ్ రాయ్ కుటుంబం.. శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కోటీశ్వరుల ఇంటి నుంచి ముగ్గురు తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గౌతమ్ రాయ్, ఆయన కొడుకు, కోడలు మూడు వేర్వేరు నియోజవకర్గాల నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇందులో రాయ్ భాజపా నుంచి పోటీలో ఉండగా.. మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అఫిడవిట్ల ప్రకారం ఈ ముగ్గురి ఆస్తుల విలువ అక్షరాలా రూ. 142 కోట్లకు పైమాటే.
అసోంలో ప్రముఖ రాజకీయనేత గౌతమ్ రాయ్ కటిగొరా నుంచి, ఆయన కుమారుడు రాహుల్ ఉదర్‌బాండ్, కోడలు డైసీ అల్గాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బరాక్ వ్యాలీలో ఉన్న ఈ మూడు స్థానాలకు రెండో విడతలో భాగంగా ఏప్రిల్ 1న పోలింగ్ జరగనుంది. 72ఏళ్ల గౌతమ్ రాయ్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత తరుణ్ గొగొయి ప్రభుత్వంలో మంత్రిగానూ వ్యవహరించారు. అయితే 2019లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆయనను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కటిగొరా నుంచి రాయ్ బరిలోకి దిగారు. అఫిడవిట్‌లో రాయ్ తన మొత్తం ఆస్తులు రూ. 3.11కోట్లుగా ప్రకటించారు. ఆయన భార్య మందిర ఆస్తులు రూ. 2.59కోట్లుగా పేర్కొన్నారు.
ఇక రాయ్ కుమారుడు రాహుల్ కూడా 2006లో కాంగ్రెస్ టికెట్‌పై అల్గాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2019లో పౌరసత్వ చట్టానికి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో ఆయన ఉదర్‌బాండ్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన అల్గాపూర్ నుంచి రాహుల్ సతీమణి డైసీ బరిలోకి దిగారు. వీరిద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అఫిడవిట్‌లో రాహుల్ తనకు రూ. 136.22కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య డైసీ పేరు మీద రూ. 18.04లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు.