Borewell baby dies : గుజరాత్లో శనివారం ఉదయం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాపను కాపాడేందుకు 19 గంటల పాటు.. తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఘటనపై సమాచారం అందుకుని, వెంటనే రెస్కూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు.. ఆదివారం తెల్లవారుజామున పాపను బయటకు తీశారు. అయితే.. చిన్నారి చనిపోయిందని నిర్ధరించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జామ్‌నగర్‌లో జిల్లాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు ఓ బోరుబావిలో పడింది. 200 అడుగుల లోతున్న బోరుబావిలో చిన్నారి పడిపోయినట్లు సమాచారం. 40 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకుందని అధికారులు తెలిపారు. తమచన్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. చిన్నారి కుటుంబ సభ్యులు ఓ గిరిజన తెగకు చెందిన వారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ పొలంలో పనులు చేస్తున్నారు. అదే సమయంలో ఆ చుట్టుపక్కల ఆడుకుంటున్న చిన్నారి.. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడింది. ఇది గమనించిన చిన్నారి కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
borewell baby rescue operation : సమాచారం అందుకున్న అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు.. శనివారం ఉదయం 11 గంటలకు సహాయక చర్యలు ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా 10 అడుగులు లోతులో గొయ్యి తవ్వి.. పాపను తీసేందుకు ప్రయత్నించారు. సైన్యం కూడా ఈ ఆపరేషన్‌కు సాయం అందించింది. చిన్నారికి ఆక్సిజన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. కెమెరా సాయంతో చిన్నారిని ఉన్న స్థితిని తెలుసుకున్నారు. 108 అంబులెన్స్ సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఈ ఉదయం 5.45కు పాపను బయటకు తీశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాలు విడిచిందని నిర్ధరించారు.