తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్​ల అత్యవసర వినియోగంపై నేడు పరిశీలన

యావత్ దేశం ఆశగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ అతి త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. దీనిపై నిపుణుల బృందం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది.

By

Published : Dec 9, 2020, 5:49 AM IST

vaccine
కరోనా వ్యాక్సిన్

కొవిడ్​-19పై యుద్ధంలో బుధవారం కీలక ఘట్టానికి తెరలేవనుంది. కరోనా నియంత్రణకు ప్రధాన ఆయుధమైన టీకా అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలంటూ మూడు సంస్థలు చేసుకున్న దరఖాస్తులపై నిపుణుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. కమిటీ కనుక టీకాల అనుమతికి ఆమోదం తెలిపితే సత్వరం భారత ఔషధ నియంత్రణ సంస్థ-డీసీజీఐకి నివేదిక పంపుతారు. డీసీజీఐ కూడా ఆమోదిస్తే రెండు వారాల్లోనే అనుమతి పత్రం జారీ అవుతుంది.

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సహా సీరం ఇన్‌స్టిట్యూట్‌, ఫైజర్‌ సంస్థలు రూపొందిస్తున్న టీకాలు డీసీజీఐ పరిగణనలో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మూడు టీకాల్లో అన్నింటికీ లేదా మూడింటిలో ఒకదాని వినియోగానికి.. అనుమతులు వచ్చే అవకాశమున్నట్లు కేంద్రం పేర్కొంది. అత్యవసర వినియోగానికి అనుమతించాలంటూ ఈ మూడు టీకా తయారీ సంస్థలు డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి.

ఎలా అనుమతిస్తారు?

ఇప్పటివరకు వచ్చిన క్లినికల్​ ప్రయోగాల ఫలితాలను నిపుణలు బృందం పరిశీలిస్తుంది. వ్యాక్సిన్​ తయారీ సంస్థల ప్రతినిధుల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటుంది. సంబంధిత ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు, సాక్ష్యాలను సమర్పిస్తేనే టీకాకు ఆమోదముద్ర వేస్తారు. లేకుంటే మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ పూర్తి చేసి, తుది ఫలితాలు వచ్చాకే పరిశీలిస్తామంటారు.

ఆమోదించాక ఏంటి?

నిపుణుల కమిటీ ఆమోదముద్ర వేస్తే వాటికి సంబంధించిన సమావేశ నిర్ణయాల (మీటింగ్​ మినిట్స్)ను సంకలనం చేసి, డీసీజీఐకు పంపుతారు. డీసీజీఐ కూడా ఆమోదం తెలిపితే అనుమతుల పత్రం జారీచేస్తుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ఫైజర్​ టీకాకు ఒక రీతిలో, దేశీయంగా ఉత్పత్తయ్యే ఇతర వ్యాక్సిన్లకు మరో రీతిలో అనుమతులు మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మార్కెట్​ ఆథరైజేషన్, తయారీ, దిగుమతి లైసెన్సులకు దరఖాస్తు చేసుకోవాలి.

భారత్​ బయోటెక్, సీరం వ్యాక్సిన్లు మన దేశంలోనే తయారవుతున్నందున అవి తొలి రెండు ప్రక్రియలు పూర్తిచేస్తే సరిపోతుంది. ఫైజర్ మాత్రం దిగుమతి లైసెన్స్​ను పొందాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే వ్యాక్సిన్లు మార్కెట్​లోకి వస్తాయి. డీసీజీఐ షరతులకు అనుగుణంగానే వాటి విక్రయం జరగాలి.

అత్యవసర వినియోగమంటే..?

ఒక రోగికి ఈ మందు మినహా ప్రత్యామ్నాయ చికిత్సలేవీ లేనప్పుడే అత్యవసర వినియోగ అనుమతిస్తారు. దీనికి ముందు డీసీజీఐ షరతులు అమలు చేయాలి. గతంలో రెమిడెసివిర్​కు ఇలాంటి అనుమతులు ఇచ్చినప్పుడూ కొన్ని నిబంధనలను పెట్టారు. వీటి ప్రకారం ఆ ఔషధం వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ముందే చెప్పాలి. వారి అనుమతి తీసుకున్నాకే ఆ ఔషధాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వ్యాక్సిన్ అత్యవసర వినియోగంలోనూ అలాంటి షరతులే ఉండొచ్చు. మూడోదశ క్లినికల్ ప్రయోగాలు పూర్తి కాకముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తున్నారన్న విషయం రోగికి తప్పనిసరిగా తెలియాలి. దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే డీసీజీఐకి సమాచారం ఇవ్వాలి.

ABOUT THE AUTHOR

...view details