భారత్‌లో కరోనా మూడో ఉద్ధృతి రావటానికి అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు ఐసీఎంఆర్ అధ్యయనపత్రం వెల్లడించింది. ఒక వేళ వచ్చినా రెండో ఉద్ధృతి అంత తీవ్రంగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఇప్పటి పరిస్థితులను, రాబోయే ఉద్ధృతులను ఎదుర్కోవటంలో వేగంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపింది.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, వైద్యనిపుణులు సందీప్ మండల్, సమీరన్, పండా, లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన నిమలన్ అరినమిన్‌పతి సంయుక్తంగా రూపొందించిన ఈ అధ్యయన పత్రం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైంది.
ముప్పు తక్కువే..
రోగనిరోధక శక్తి క్షీణించటం, రోగనిరోధక శక్తిని తప్పించుకొనేలా వైరస్‌లో మార్పులు రావటం వంటి కారణాలు మూడో ఉద్ధృతికి దారితీసే అవకాశాలు తక్కువేనని ఇందులో అభిప్రాయపడ్డారు. రెండు సందర్భాల్లోనే మూడో ఉద్ధృతి తలెత్తడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.