భారత్లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ చిక్కుల్లో పడ్డాయంటూ విదేశీ స్వచ్ఛంద సంస్థలు విమర్శించిన క్రమంలో... దేశంలో పరిస్థితి వారు అనుకున్న దానికంటే ఘోరంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాపాడటానికే తాను కట్టుబడి ఉన్నానని, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యముందని, ఈ విధానంలో ఎంతోమంది నేతలను పార్టీ ప్రోత్సహించిందని చెప్పారు.
అమెరికా లోని బ్రౌన్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అశుతోష్ వర్ష్నీ, విద్యార్థులతో రాహుల్ మంగళవారం ఆన్లైన్లో సంభాషించారు. అర్థబలం ఉన్న వారు సామాజిక మాధ్యమాలనూ, వ్యవస్థలనూ నియంత్రిస్తే.. ఎన్నికల ప్రజాస్వామ్యం విధ్వంసం కాక తప్పదని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ నిధులతో పనిచేసే ఫ్రీడం హౌస్ స్వచ్ఛంద సంస్థ.. భారత్లో ఎన్నికల నిరంకుశత్వం నెలకొందని, స్వేచ్ఛ అనే దానికి దేశాలో అర్థం మారిపోయిందని విమర్శించడంపైనా ఆయన స్పందించారు. వారు అనుకుంటున్న దాని కంటే దేశంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు.