సిపాయిల తిరుగుబాటు (1857), కాంగ్రెస్ ఏర్పాటు (1885)... పెరుగుతున్న ఆందోళనలు... క్రమంగా జాతీయోద్యమం ఊపందుకుంటుండటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం తన కుటిల రాజకీయ తంత్రానికి తెరదీసింది. అదే విభజించు పాలించు సూత్రం! అప్పటిదాకా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలసి కట్టుగా పోరాడుతున్న హిందూ-ముస్లింల మధ్య విభజన చిచ్చు పెట్టింది. 1905లో హిందూ, ముస్లిం జనాభా ఆధారంగా బంగాల్ను రెండుగా విభజించింది. అది మొదలు మత విభజనకు బీజం పడింది!
అదే చివరకు దేశ విభజనకూ దారి తీసింది!
1765 నుంచి బంగాల్, బిహార్, ఒడిస్సాలు కలసి ఒకే రాష్ట్రంగా ఉండేవి. 1905 నాటికే ఉమ్మడి బంగాల్ జనాభా దాదాపు 8 కోట్లు! దీంతో... పరిపాలన సౌలభ్యం కోసమని సాకు చూపుతూ... అప్పటి వైస్రాయి లార్డ్ కర్జన్ బంగాల్ను రెండుగా విభజిస్తున్నట్లు అక్టోబరు 16, 1905నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు బంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్), మిగిలిన ప్రాంతాలతో పశ్చిమ బంగాల్! భారత్‌లో అడుగుపెట్టిన తెల్లవారికి తూర్పు తీరమైన బంగాల్ ప్రధాన కేంద్రంగా ఉండేది. విద్యాపరమైన సదుపాయాలు కూడా పెరిగాయి. దీనివల్ల బంగాల్లో విద్యాధికులు అధికంగా ఉండేవారు. జాతీయోద్యమంలో కూడా వీరి పాత్ర ఎక్కువే! రాష్ట్రాన్ని విభజించటం ద్వారా ఆ విధంగా కూడా ఉద్యమాన్ని బలహీనపర్చినట్లవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.