Avinash Vs CBI : ఆయన మాజీమంత్రి హత్య కేసులో నిందితుడు. సీబీఐ విచారణకు పిలిస్తే వెళ్లరు. అరెస్టు చేయడానికి వస్తే అనుచరులతో అడ్డుకుంటారు. దారిదాపుల్లోకి కూడా సీబీఐ రాకుండా అరాచకం సృష్టిస్తున్నారు. అడ్డుకోవాల్సిన రాష్ట్ర పోలీసులు నిందితుడికి వత్తాసు పలుకుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమరావతిలో హక్కులు కోసం నిరసన తెలుపుతున్న రైతులపై దాష్టీకం ప్రదర్శిస్తున్న పోలీసులు కర్నూలులో హత్య కేసు నిందితుడికి మద్దతుగా మోహరించిన అల్లరిమూకలకు కొమ్ముకాస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు.
సంత్ రామ్‌పాల్ తరహాలో... హరియాణా హిస్సార్‌లోని సంత్‌లోక్ ఆశ్రమ నిర్వాహకుడు సంత్ రామ్‌పాల్ హత్యలు సహా పలు కేసుల్లో నిందితుడు. న్యాయస్థానాలు విచారణకు పిలిచినప్పుడు హాజరుకాకుండా ధిక్కరిస్తున్న ఆ ఆశ్రమ నిర్వాహకుడు సంత్ రామ్‌పాల్‌ను కోర్టు ఆదేశాల మేరకు అరెస్టు చేసేందుకు 2014లో ఆ రాష్ట్ర పోలీసులు రంగంలోకి దిగారు. వారి రాక కంటే ముందే సంత్ రామ్‌పాల్ ఆశ్రమం బయట, లోపల వేలాది మంది తన అనుచరులను మోహరించారు. పోలీసులను లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రోజుల తరబడి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. కొందరు గాయపడ్డారు. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 2014లో జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ఇక్కడా అవే పరిస్థితులు... సంత్ రామ్‌పాల్ విషయంలో అప్పట్లో హిస్సార్‌లో చూసిన పరిస్థితులు ఇప్పుడు అవినాష్ రెడ్డి వ్యవహారంలో కర్నూలులో కళ్లకు కడుతున్నాయి. సంత్ రామ్‌పాల్ హరియాణా పోలీసులకు చుక్కలు చూపిస్తే అవినాష్ రెడ్డి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ సీబీఐనే ముప్పుతిప్పలు పెడుతున్నారు. అప్పట్లో హరియాణా పోలీసులు అత్యంత ఉద్రిక్తత పరిస్థితులను ఎదుర్కొని మరీ సంత్ రామ్‌పాల్‌ను అరెస్టు చేయగలిగారు. ఇప్పుడు సీబీఐ మాత్రం అవినాష్ అనుచరులను దాటుకెళ్లి అతన్ని అరెస్టు చేయలేకపోతోంది. హరియాణాలో అక్కడి ప్రభుత్వమే రంగంలోకి దిగి సంత రామ్‌పాల్‌ను పోలీసులతో ఆరెస్టు చేయించింది. ఏపీలో మాత్రం నిందితుడ్ని అరెస్టు చేయటానికి వచ్చిన సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోగా నిందితుడైన అవినాష్ రెడ్డికి అనుకూలంగా మోహరించిన ఆయన అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు రాచమర్యాదలు చేస్తోంది.