ఠాణెకు చెందిన వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరేన్ హత్యకేసు దర్యాప్తులో రోజురోజుకు పురోగతి కనిపిస్తోంది. హిరేన్ హత్యకు పథకం రచించేందుకు భేటీ అయిన సమయంలో ముంబయి పోలీసు అధికారి సచిన్ వాజేతోపాటు మరో కానిస్టేబుల్ వినాయక్ షిండే కూడా అక్కడే ఉన్నట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) వెల్లడించింది. అంతేకాకుండా కుట్రపన్నిన వారితో మాట్లాడేందుకు ఓ మొబైల్ ఫోన్‌ను సచిన్ వాజే ఉపయోగించినట్లు కోర్టుకు తెలిపింది. అయితే, కుట్ర వెనకున్న ఉద్దేశాన్ని త్వరలోనే కనుగొంటామని కోర్టుకు సమర్పించిన తాజా నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.
హిరేన్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా కానిస్టేబుల్ షిండేతో పాటు మరోవ్యక్తిని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక సంస్థ(ఏటీఎస్) తొలుత అరెస్టు చేసింది. వీరి నుంచి కీలక ఆధారాలు సేకరించిన ఏటీఎస్..ఈ కేసులో సచిన్ వాజే కీలక సూత్రధారిగా తేల్చింది. ఇదే సమయంలో పేలుడు పదార్థాల వాహనంపై దర్యాప్తు జరుపుతోన్న ఎన్‌ఐఏ ఇప్పటికే సచిన్ వాజేను విచారిస్తోంది. ఇతనితో పాటు ఏటీఎస్ అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకొని విచారించగా మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. హిరేన్ హత్యకు పథక రచన జరిగిన సమయంలో పోలీస్ అధికారి సచిన్ వాజేతో పాటు కానిస్టేబుల్ షిండే కూడా అక్కడే ఉన్నట్లు ఎన్‌ఐఏ తేల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్‌ఐఏ పేర్కొంది.