తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏరువాక వదిలి పోరువాకా సాగారో... - రైతుల ఉద్యమం

కురిసే వాన చినుకుని తినే అన్నం మెతుకుగా మార్చగల శక్తి అన్నదాతది. ప్రతి మెతుకు మీదా తినేవారి పేరు రాసుంటుందో లేదో కానీ పండించినవారి పేరు మాత్రం రాసి ఉండే ఉంటుంది. సాగులోని కష్టనష్టాల్ని అర్థం చేసుకునే మనసుకి ఆ భాష తెలిసే ఉంటుంది. పంటతో పాటు తానూ ఎండకు ఎండి వానకు తడిసి కంటికిరెప్పలా దాన్ని కాపాడి దేశానికి తిండి పెట్టే రైతన్నకి వ్యవసాయం ఏడెనిమిది గంటల ఉద్యోగమో వృత్తో కాదు, ఇరవై నాలుగ్గంటల జీవితం. ప్రకృతి కన్నెర్ర జేసి పంట దక్కక పోయినా నేలతల్లి మీద అతడికి నమ్మకం సడలదు, మమకారం పోదు. అందుకే నేలనీ... పంటనీ... రైతునీ... వేర్వేరుగా విడదీసి చూడలేం. కానీ, అలా విడదీసే పరిస్థితులు ఎక్కడ వస్తాయోనన్న ఆందోళన ఇప్పుడు రైతన్నని రోడ్డెక్కేలా చేసింది. కనీవినీ ఎరగని రీతిలో నెలల తరబడి నిరసన జెండా ఎగరేసేలా చేసింది.

farmers
farmers

By

Published : Feb 28, 2021, 5:15 AM IST

గుండె నిండా లక్ష్యం..

కొండల్ని పిండి చేసే ధ్యైర్యం..

సాధించాలనే తపన..

పట్టు వీడని పట్టుదల..

మొక్కవోని దీక్ష..

దేనికీ తలొగ్గని తెగువ..

అమ్మలాంటి భూమి కోసం ప్రాణాలైనా ఇచ్చేంత త్యాగం..

ఇది దిల్లీ సరిహద్దులో మూడు నెలలుగా ఉద్యమిస్తోన్న రైతుల పరిస్థితి.

ట్రాక్టర్​ ర్యాలీ

నిమ్రత్‌ కౌర్‌ ఎంత చలిగా ఉన్నా సరే ఐదింటికల్లా నిద్రలేస్తుంది. గబగబా తయారై వంటగదివైపు వెళ్తుంది. అప్పటికే అక్కడ కొందరు టీ తయారు చేస్తుంటారు. దాంతోపాటు కాసిన్ని బిస్కట్లు కూడా తీసుకునివెళ్లి పక్క టెంటులో ఉన్న పెద్దలుఅందరినీ లేపి, వాళ్లంతా టీ తాగి మందులవీ వేసుకునేందుకు సాయం చేస్తుంది. ఆ తర్వాత రెండు గంటలు టిఫిన్ల పని ఉంటుంది. అదయ్యాక అక్కడున్న పిల్లలందరినీ జమ చేసి బడి టెంటులోకి తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. మరో నలుగురు యువతులతో కలిసి భోజనం వేళ వరకూ వారికి పాఠాలూ కథలూ చెబుతుంది. భోజనాల పని అయిపోయాక ప్రధాన వేదిక దగ్గరకి వెళ్లి కాసేపు కూర్చుని ప్రసంగాలు వింటుంది. ఒక్కోరోజు ట్రాక్టరులో మహిళలను ఎక్కించుకుని ఊరేగింపుగా తీసుకెళ్తుంది. సాయంత్రం అవుతూనే మళ్లీ కాసేపు వంటా భోజనం ఏర్పాట్లకు సాయం చేసి అవి అయ్యాక ఆవరణ అంతా శుభ్రం చేసి టెంటులోకి చేరుకుంటుంది.

పరిస్థితుల గురించి తోటివారితో చర్చలు జరుపుతూ ఎప్పుడో నిద్రలోకి జారుకుంటుంది. గత రెండున్నర నెలలుగా ఇదే ఆమె దినచర్య. నిమ్రత్‌ కౌర్‌ వయసు ముప్పయ్యారేళ్లు. నాలుగేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు. ఉన్న నాలుగెకరాల పొలమే ఆ కుటుంబానికి ఆధారం. నిమ్రత్‌ స్వయంగా పొలం పని చూసుకుంటుంది. గోధుమలూ కూరగాయలూ పండిస్తుంది. వాటిని పొరుగూళ్లో ఉన్న మార్కెట్‌యార్డుకి తీసుకెళ్లి అమ్ముతుంది. ఇక ముందు మార్కెట్‌ యార్డు ఉండదేమోనని తోటి రైతులంతా మాట్లాడుకుంటుంటే విన్న నిమ్రత్‌ కొత్త చట్టాల గురించి తెలుసుకుంది. పిల్లల్ని తోటికోడలికి అప్పజెప్పి సాటి రైతులతోపాటు తానూ నిరసనలో పాల్గొనడానికి సింఘూ వచ్చింది. చాలారోజులు కావడంతో ఇంటికెళ్లి పిల్లల్ని చూడాలని ఆ తల్లి మనసు కొట్టుకుంటోంది... అలాగని అస్థిమితంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడున్నవారిని వదిలిపెట్టి వెళ్లాలనీ లేదు. తనకేమన్నా అయితే పిల్లల్ని చూసుకోడానికి బంధువులు ఉన్నారు. కానీ ఆ భూమే లేకపోతే తన బిడ్డలకు భవిష్యత్తే ఉండదు. అందుకే ఎంత కష్టమైనా సరే భరించి, చట్టాలు రద్దయ్యాయన్న శుభవార్తతోనే వెళ్లాలని స్థిరనిశ్చయంతో ఉంది.

దిల్లీ సరిహద్దుల్లో నిరసన ప్రదర్శన చేపడుతున్న లక్షలాది రైతుల్లో నిమ్రత్‌ లాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లది హరియాణా కావచ్చు, రాజస్థాన్‌ కావచ్చు, యూపీ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర... ఏదైనా కావచ్చు. పాతిక ముప్పై ఎకరాలున్న పెద్ద రైతుల కన్నా తనలాంటి చిన్న రైతులే ఎక్కువ అంటుంది నిమ్రత్‌. ప్రకాష్‌ వయసు 58 ఏళ్లు. పటియాలా నుంచి వచ్చాడు. చదువురాని తనకు ఇంకేపనీ చేతకాదని రాత్రంతా మెలకువగా ఉండి టీ కాస్తుంటాడు. శిబిరాల దగ్గర గస్తీ తిరుగుతున్న వాలంటీర్లకు గంట గంటకీ టీ ఇచ్చి చలినుంచి వారిని కాపాడుతున్నాడు.

వణికిస్తున్న చలిని లెక్క చేయకుండా మంచు కురిసినా, వాన కురిసినా టెంటుల్లోనో ట్రాక్టర్‌ ట్రాలీల్లోనో తలదాచుకుంటూ ఉన్న నిమ్రత్‌, ప్రకాష్‌ లాంటి లక్షలమందిని అక్కడ పట్టి నిలుపుతున్నది ఏమిటీ... ఆ చట్టాల్లో ఏముందీ... ఎందుకు వారంతా వాటిని వ్యతిరేకిస్తున్నారూ.... అంతమంది అసలక్కడ మూడు నెలలుగా ఎలా ఉంటున్నారూ అంటే...

రైతుల నిరసన

ఇవీ చట్టాలు

గత ఏడాది సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం కొత్తగా మూడు వ్యవసాయ చట్టాలను చేసింది. వాటి గురించి తెలుసుకున్న రైతులు ఆ చట్టాల వల్ల తమకు లాభం కన్నా నష్టమే ఎక్కువని అర్థం చేసుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తును కాలరాచే ఆ చట్టాలను
అమలుచేయొద్దంటూ రెండు నెలలపాటు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఫలితం కనిపించకపోయేసరికి రైతు సంఘాలన్నీ సంఘటితమై ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని చేపట్టాయి. నవంబరు 30 నాటికల్లా అన్ని వైపుల నుంచి దిల్లీ నగర సరిహద్దులకు చేరిన రైతుల్ని నగరంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలన్నీ సంయుక్త కిసాన్‌ మోర్చా, ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ లాంటి వాటికింద ఒక్క తాటి మీదికి వచ్చి ఒక్క మాటమీద నిలిచి చట్టాలను రద్దు చేసేవరకూ రాజధాని శివార్లలో బైఠాయించడానికే నిర్ణయించుకున్నాయి. రైతుల్ని ఆందోళనకు గురిచేసిన ఆ చట్టాల్లో ఏముందీ అంటే...

ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌(ప్రొమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) చట్టం:దీనికింద రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతులు కానీ పంట కొంటున్న వ్యాపారులు కానీ రాష్ట్రప్రభుత్వాలకు ఎలాంటి ఫీజులూ సెస్‌లూ కట్టనక్కరలేదు, లైసెన్సులూ తీసుకోనక్కర్లేదు.

ఫార్మర్స్‌(ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ ఎష్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ చట్టం:పంట సాగుకన్నా ముందే దిగుబడిని కొనుక్కునే వ్యాపారితో రైతు ఒప్పందం కుదుర్చుకోడానికి వెసులుబాటు కల్పిస్తుంది ఈ చట్టం. ఈ ఒప్పందంలో ఏమైనా తేడాలొస్తే జిల్లా కలెక్టరు ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. ఆ వివాదాలు న్యాయవ్యవస్థ పరిధిలోకి రావు.

ఎసెన్షియల్‌ కమోడిటీస్‌(సవరణ) చట్టం:అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే పప్పులూ ఉల్లిపాయలూ లాంటి నిత్యావసరాల ధరలనూ నిల్వలనూ నియంత్రించే అధికారం కేంద్రానికి ఉంటుంది. మామూలు సమయాల్లో వాటిని ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు కొనుక్కోవచ్చు, నిల్వచేసుకోవచ్చు.

ఈ చట్టాలు రైతులకు తమ ఉత్పత్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎంతకి అమ్ముకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛనిస్తున్నాయని ప్రభుత్వం అంటోంది. రైతులు వాటిని వ్యతిరేకించడానికి కారణం- ఇప్పటివరకూ తమ పంటలను కొంటూ వచ్చిన వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఈ చట్టాల వల్ల క్రమంగా బలహీనపడతాయనీ తర్వాత ఆ వ్యవస్థే నశించిపోతుందనీ, అప్పుడిక రైతులు పూర్తిగా కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సివస్తుందనీ వారు భయపడుతున్నారు. ఒప్పందాల కారణంగా తాము అప్పులపాలైతే ఆ అప్పుకింద తమ భూమిని లాక్కున్నా అడిగేవారుండరనీ, అలాగే ఇప్పటివరకూ తమకు పంట త్వరగా అమ్ముడై డబ్బు చేతికి వచ్చేందుకు సహకరిస్తున్న స్థానిక ఏజెంట్ల సాయమూ ఉండబోదనీ, వ్యవసాయ మార్కెట్లు లేకపోతే కనీస మద్దతు ధర అందే అవకాశమూ ఉండదనీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ మూడు చట్టాలనూ రద్దు చేసి, ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ మాత్రమే ఇస్తానంటున్న కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించాలన్నది రైతులు చేస్తున్న డిమాండు.

ఎందుకీ పరిస్థితి...

మన దేశ ఆర్థికవ్యవస్థకి వెన్నెముక వ్యవసాయం. నాలుగేళ్ల క్రితం 44 లక్షల కోట్ల విలువ గల ఈ వ్యవసాయ రంగం మరో రెండేళ్ల కల్లా 90లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. డెబ్భై శాతం ప్రజలకు జీవనాధారం అదే. వారిలోనూ ఎక్కువమంది రెండు మూడు ఎకరాల పొలం మాత్రమే ఉన్న చిన్న రైతులు. ఈ చిన్న చిన్న కమతాలకు తోడు చాలాసార్లు ప్రకృతి సహకరించకా, అది సహకరించి పంట బాగా పండినప్పుడు గిట్టుబాటు ధర లేకా రకరకాల కారణాలతో అప్పుల పాలవుతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నదే. జాతీయ నేర రికార్డుల బ్యూరో ప్రకారం 1995-2016 మధ్య 3,33,407 మంది ఆత్మహత్యలు చేసుకోగా, ఆ తర్వాత మళ్లీ మూడేళ్లకి ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం 2019లోనే 10,281 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్ని మార్చడానికి వ్యవసాయ రంగంలో సంస్కరణలు తేవాలనీ, రైతులకు తోడ్పడే చట్టాలను చేయాలనీ ఎప్పటినుంచో పాలక వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాలు రైతుల మనసును గెలుచుకోలేకపోయాయి. రైతు ప్రతినిధులతో చర్చించకుండా, పార్లమెంటులోనూ లోతైన చర్చకు అవకాశం ఇవ్వకుండా ఆదరాబాదరాగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నది వారి వాదన. కొత్త చట్టాల వల్ల వ్యవసాయంలో ఉత్పత్తిదారుల ప్రాధాన్యం తగ్గి వ్యాపారస్తుల ప్రాధాన్యం పెరుగుతుందనీ ఇవి రైతుల పరిస్థితిని పెనం మీంచి పొయ్యిలో పడేలా చేస్తాయనీ వారు ఆందోళన చెందుతున్నారు.

రైతులను కార్పొరేట్లకు అప్పజెప్పడం వల్ల వ్యవసాయ ఆదాయం పెరగకపోగా, రైతుల పరిస్థితి మరింత దిగజారినట్లు వివిధ ప్రపంచదేశాల అనుభవం చెబుతోందంటున్నారు- వ్యవసాయవిధాన నిపుణులూ ఆర్థికవేత్తలూ అయిన దేవేంద్ర శర్మ, జీన్‌ డెరెెజ్‌, కౌశిక్‌ బసు తదితరులు. ఉన్న వ్యవస్థలోని లోపాలను సవరించడానికి బదులు మరో విఫలమైన మోడల్‌ని ప్రవేశపెట్టడం పరిష్కారం కాదన్నది వారి అభిప్రాయం.

అందుకే ఆ చట్టాలను రద్దు చేయమని కోరుతూ దాదాపు మూడు లక్షల మంది రైతులు గత మూడు నెలలుగా రాజధాని నగరమైన దిల్లీకి మూడు పక్కలా సింఘు, గాజీపూర్‌, టిక్రీ సరిహద్దుల్లో మకాం వేసి నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులే కాక ఇతర రంగాలవారూ వారికి మద్దతునిస్తున్నారు. ప్రభుత్వానికీ రైతులకీ మధ్య పదకొండు దఫాలు చర్చలు జరిగినా సయోధ్య కుదరలేదు. ఏడాదిన్నర వరకూ ఆ చట్టాలను అమలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించినా, వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని సుప్రీంకోర్టు కమిటీ వేసినా... రైతులు మాత్రం చట్టాల రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదీ తమకు అక్కర్లేదని తేల్చి చెబుతున్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి...

గత మూడు నెలలూ ఉత్తరాదిన తీవ్రమైన చలికాలం. మూడు, నాలుగు డిగ్రీలకు పడిపోయాయి ఉష్ణోగ్రతలు. ప్రాణాలను పణంగా పెట్టి మరీ అక్కడ ఉంటున్నవారిలో పసి పిల్లలతో వచ్చిన తల్లుల నుంచీ డెభ్బై, ఎనభై ఏళ్ల వృద్ధుల వరకూ అందరూ ఉన్నారు. ఏమాత్రం అనుకూలంగాలేని ఆ వాతావరణానికి, ఏమవుతుందో తెలియని గందరగోళం వల్ల కలిగే మానసిక ఆందోళన తోడై గుండెపోటుతోనో ఇతర అనారోగ్యాలతోనో కొందరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. నిస్పృహతో ఆత్మహత్యలకు పాల్పడినవారు కొందరు. ఆ నిరసన శిబిరాల్లో ఈ మూడునెలల్లోనే దాదాపు 250 ప్రాణాలు పోయాయి. బాబా రామ్‌సింగ్‌ అనే మత పెద్ద రైతుల కష్టాల గురించి పది పేజీల లేఖ రాసి తుపాకీతో కాల్చుకుని ప్రాణం వదిలాడు. తుపాకీ తూటాతో- అది తగిలిన ఒక్క ప్రాణం మాత్రమే పోతుందనీ, అన్యాయమనే తూటా మాత్రం ఒక్క వేటుతో ఎందరినో హతమారుస్తుందనీ, అన్యాయాన్ని భరించాల్సి రావడాన్ని మించిన వేదనాభరితమైనదేదీ ప్రపంచంలో లేదనీ అతడు రాసిన లేఖ అందరినీ కంటతడి పెట్టించింది. కశ్మీర్‌ సింగ్‌ లడీ అనే 75 ఏళ్ల వృద్ధుడు కొడుకూ మనవళ్లను వెంటపెట్టుకుని వచ్చి రెండు నెలలుగా నిరసనల్లో పాల్గొంటున్నా ఫలితం కన్పించకపోవడంతో నిస్పృహ చెందాడు. "ఎన్నాళ్లు మేమంతా ఈ చలిలో అవస్థ పడాలి, నా చావుతోనన్నా పరిస్థితి మారుతుందేమోనన్న ఆశతో ప్రాణాలు విడుస్తున్నా"నని రాసి ఉరివేసుకున్నాడు.

ఇలాంటి వ్యథాభరిత కథలెన్నో ఆ శిబిరాల్లో వినిపిస్తాయి. రోజుకు ఒకరిద్దరు చొప్పున కళ్లముందే ప్రాణాలు విడుస్తున్నా వారు నిబ్బరాన్ని కోల్పోవడం లేదు. శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకూ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అక్టోబరు రెండు వరకూ అక్కడే ఉండటానికి తాము సిద్ధంగా ఉన్నామనీ ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తామనీ చెబుతున్న రైతన్నలు వంతులవారీగా ఊరికి వెళ్లివస్తూ అక్కడ పొలం పనులకూ ఆటంకం లేకుండా చూసుకుంటున్నారు.

చరిత్రే సాక్షి

భూమి మీద తమ హక్కును రక్షించుకోడానికి రైతులు పోరుబాట పట్టడం మన దేశంలో కొత్తేం కాదు. 18వ శతాబ్దం చివర్లో బ్రిటిష్‌ పాలకులు చీనాబ్‌ నది నుంచి కాలువ ద్వారా నీటిని మళ్లించి పేద రైతుల చేత బంజరు భూములను సాగుచేయించారు. ఆ భూముల్ని వారికే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ తర్వాత తెచ్చిన చట్టం ద్వారా ఆ భూముల మీద రైతులకు ఏ హక్కూ లేకుండా చేయడమే కాక, అక్కడ వారిని ఇళ్లు కూడా కట్టుకోనివ్వలేదు. దానికి తోడు వారసులు లేని రైతుల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో కేవలం పంజాబ్‌ని ఉద్దేశించి మరో రెండు చట్టాలనూ చేశారు. దాంతో ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా 1907లో ‘పగ్డి సంభల్‌ జట్టా’ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. తల పాగా సిక్కుల ఆత్మగౌరవానికి గుర్తు. దాన్ని భద్రంగా చూసుకోమన్న నినాదంతో సాగిన ఆ ఉద్యమం బ్రిటిష్‌ ప్రభుత్వం చట్టాలను రద్దు చేసేవరకూ చల్లారలేదు. 80వ దశకంలో తడిసి మోపెడైన తమ కరెంటూ నీటి బిల్లుల్ని మాఫీ చేయాలనీ, చెరకు పంటకి ధర పెంచాలనీ కోరుతూ మొత్తం 35 డిమాండ్లతో దాదాపు ఐదు లక్షల మంది రైతులు ట్రాక్టర్లతో దిల్లీలోని బోట్‌ క్లబ్‌ ప్రాంతానికి చేరుకున్నారు. రెండు రోజులనుకుని వచ్చిన వారంతా వారం రోజులైనా అక్కడి నుంచి కదలలేదు. దాంతో నాటి ప్రభుత్వం దిగి వచ్చింది, రైతులు కోరిన చాలా డిమాండ్లను అంగీకరించింది.

ప్రస్తుత రైతుల ఉద్యమం పై రెండు సందర్భాలనీ గుర్తు చేస్తోందంటున్నారు పరిశీలకులు.
"మావి గొంతెమ్మ కోరికలు కావు, మాకు హానికరమైన చట్టాలను బలవంతంగా మామీద రుద్దవద్దని మాత్రమే కోరుతున్నాం... ప్రభుత్వం అందుకు అంగీకరిస్తే కృతజ్ఞతలు చెప్పి మా దారిన మేం వెళ్లిపోతాం" అంటున్న ఈ అన్నదాతలకు కాలం ఏం సమాధానం చెబుతుందో మరి!

ఒకే కుటుంబం!

కిసాన్​ మాల్స్

ఒకప్పుడు ఎవరింట్లో అయినా పెళ్లో మరో వేడుకో ఉంటే పల్లె అంతా ఒకటయ్యేది. కూరగాయలూ పాలూ పెరుగూ లాంటివి తెచ్చివ్వడమే కాక పనుల్లోనూ తలా ఒక చెయ్యీ వేసి శుభకార్యాన్ని గట్టెక్కించేవారు. కష్టసుఖాల్ని కలిసిపంచుకోవడమనే ఆనాటి పల్లె సంస్కృతికి అద్దం పడుతున్నాయి రైతుల శిబిరాలు. పొలమూ ఇల్లూ తప్ప రెండో ధ్యాస ఉండని రైతులు ఆ రెంటినీ వదిలి వచ్చి రోడ్డుపక్కన గుడారాల్లో నెలల తరబడి ఉండగలగడానికి కారణం దేన్నైనా మనస్ఫూర్తిగా పంచుకునే ఆ సంస్కృతే. ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏ పనీ చెప్పరు. అయినా అందరూ అన్ని పనులూ చేసేస్తారు. ఒకరి బాగోగులు మరొకరు పట్టించుకుంటారు. వెచ్చని చోటైనా, పట్టెడు మెతుకులైనా ఉన్నదాంట్లోనే పంచుకుని కుల, మత, ప్రాంత, భాషా భేదాలకి అతీతంగా వసుధైక కుటుంబంలా కలిసి ఉంటున్న ఆ శిబిరాల్లోకి ఒకసారి తొంగిచూస్తే...

ఉద్యమంలో మహిళలు
  1. ఆహారం:దేవాలయాల్లోలాగే సిక్కుల గురుద్వారాల్లోనూ అన్నదానం చేసే లంగర్‌ ఉంటుంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన గురుద్వారా కమిటీలు ఇక్కడ లంగర్‌లను నిర్వహిస్తూ రైతుల కడుపు నింపుతున్నాయి. ఏ పక్కకి వెళ్లినా వేడి వేడి టీ నీళ్లో, తియ్యని పాయసమో అందిస్తారు వాలంటీర్లు. ఖాల్సాఎయిడ్‌, ముస్లిం ఫెడరేషన్‌ ఆఫ్‌ పంజాబ్‌ లాంటి స్వచ్ఛంద సంస్థలు వారికి సహకరిస్తున్నాయి. కేరళ రైతులు 16 టన్నుల అనాసపండ్లను ట్రక్కుల్లో పంపితే ఇతర ఎన్జీవోలు శక్తిమేరకు నిత్యావసరాలను పంపిస్తున్నాయి.
  2. నీరు:స్వచ్ఛంద సంస్థలు మొదట్లో తాగునీటి సీసాలు సరఫరాచేశాయి. తర్వాత ఖాల్సాఎయిడ్‌ ఆర్‌.ఓ. ప్లాంట్‌ని ఏర్పాటుచేసింది. వాడుకునే నీటికోసం ఒకచోట రైతులే స్వయంగా బోరుబావినీ తవ్వుకున్నారు.
  3. నీడ:కొందరు తమ ట్రాక్టర్‌ ట్రాలీలనే ఆవాసంగా మలచుకుంటే కొందరు వరసగా చిన్న చిన్న టెంట్లు వేసుకుని రాత్రిళ్లు గడుపుతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు పెద్ద పెద్ద టెంట్లను వేసి అందులో పరుపులను అమర్చాయి.
    రోడ్డుపైన వంటవార్పు
  4. వైద్యం:ఆక్సిజన్‌ సిలిండర్లూ పడకలతో సహా ప్రతి చోటా రెండు మూడు వైద్య శిబిరాలు ఉన్నాయి. మెడికల్‌ కాలేజీలకు చెందిన పీజీ విద్యార్థులు, ఎయిమ్స్‌, సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రుల సిబ్బందీ సేవలు అందిస్తున్నారు.
  5. విద్య:తల్లులతో పాటు వచ్చిన చిన్న పిల్లలు చదువుకోడానికి ఒక చిన్న టెంటును స్కూలులా మలిచారు. మరో పక్కన ఎవరైనా చదువుకోడానికి వీలుగా పుస్తకాలతో గ్రంథాలయం పెట్టారు.
  6. స్నానపుగదులు:వేడినీటి సౌకర్యంతో స్నానపు గదుల్ని ఖాల్సాఎయిడ్‌ ఏర్పాటుచేయగా 'బేసిక్‌ షిట్‌' అనే సంస్థ బయో టాయ్‌లెట్లను కట్టించింది. కొందరు వాషింగ్‌మెషీన్లను తెచ్చి దుస్తుల్ని ఉతికి పెడుతున్నారు.
    ఒకే కుటుంబంలా
  7. మాల్స్‌:రైతు శిబిరాల దగ్గరే 'కిసాన్‌మాల్స్‌'ని ఏర్పాటుచేసి అత్యవసరమైన మందుల నుంచి రోజూ వాడుకునే బ్రష్షూ పేస్టూ లాంటివాటి వరకూ ఉచితంగా అందిస్తోంది ఖాల్సా ఎయిడ్‌ సంస్థ.
  8. పత్రిక, ఛానల్‌:ఉద్యమం గురించి ఫేక్‌ న్యూస్‌ వ్యాపించకుండా కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి సొంత యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించారు. అలాగే వారానికి రెండుసార్లు 'ట్రాలీ టైమ్స్‌' పేరుతో సొంతపత్రికనీ ప్రచురించుకుంటున్నారు. రైతు నేతలూ, సాగు చట్టాల నిపుణులూ రాసిన వ్యాసాలతో పాటు సంపాదకీయమూ ఫొటోలూ కార్టూన్లూ కవితలూ అందులో ఉంటాయి.
  9. న్యాయకేంద్రం:నిరసనల్లో పాల్గొంటున్న రైతుల మీద కేసులు పెడితే న్యాయసహాయం అందించేందుకూ, మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇప్పించేందుకూ న్యాయనిపుణులు ఇక్కడ అందుబాటులో ఉంటారు.
  10. వ్యాయామం:చలికి కండరాలు బిగుసుకుపోకుండా యువకుల కోసం వ్యాయామశాల, కాళ్ల నొప్పులతో అవస్థ పడే పెద్దల కోసం ఫుట్‌ మసాజ్‌ మెషీన్లను ఏర్పాటుచేశారు.
    పోలీసు బలగాలను ఎదిరించి

ABOUT THE AUTHOR

...view details