కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు టీకా వేయించుకోవాలని ఓ వృద్ధుడు చూపిన చొరవ ప్రశంసలు అందుకుంటోంది. దూరాన్ని ఖాతరు చేయకుండా ప్రభుత్వం చేపట్టిన యజ్ఞానికి చేదోడుగా నిలిచారు. ఆయనే ఝార్ఖండ్‌కు చెందిన రామ్ కిశోర్ సాహూ. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆయన.. టీకా తీసుకొని తన వయసు వాళ్లకు ఆదర్శమయ్యారు.
రామ్ కిశోర్ సాహూది ఝార్ఖండ్ రాష్ట్రంలోని సర్జమ్ది గ్రామం. ఆయన వయసు 80 సంవత్సరాలు. రెండో దశ టీకా కార్యక్రమంలో 60 ఏళ్లు పైబడినవారికి టీకా ఇస్తుండటంతో.. ప్రభుత్వ సూచనను అనుసరిస్తూ తాను కూడా ఎలాగైనా టీకా తీసుకోవాలనుకున్నారు సాహూ. అయితే ఆయన ఊరికి దగ్గర్లో ఎక్కడా టీకా కేంద్రం లేదు. దాంతో ఎలాగైనా టీకా వేయించుకునేందుకు ద్విచక్రవాహనంపై రాజధాని నగరం రాంచీకి వెళ్లారు. అది కూడా ఆ వయసులో బండిపై ఒంటరిగా. 70 కిలోమీటర్లు ప్రయాణించి సదర్ ఆసుపత్రికి చేరుకొని మొదటి డోసు వేయించుకున్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. 'టీకా సురక్షితమైంది. అది తీసుకున్న తరవాత నాకు ఎలాంటి సమస్యా రాలేదు' అని ఆయన వెల్లడించారు. మళ్లీ బండిపై వచ్చిన దారిలోనే ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు.