CM KCR and Ministers First Sign on Important Files: తెలంగాణలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆత్మగౌరవ ప్రతీకగా సంప్రదాయం, ఆధునికత, సాంకేతికత మేళవింపుగా నిర్మించిన... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం 6వ అంతస్తులో పూజాకార్యక్రమాల్లో పాల్గొని... సీఎం ఛాంబర్లో కేసీఆర్ ఆసీనులయ్యారు. నిర్ణీత ముహూర్తం... ఒంటిగంట 20నిమిషాల నుంచి ఒంటిగంటా 32 నిమిషాల మధ్య ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపై తొలి సంతకం చేయగా... మెుత్తం 6 ఫైళ్లపై సంతకాలు సీఎం చేశారు.
కీలక దస్త్రంపై కేటీఆర్ సంతకం: సచివాలయంలోని ఛాంబర్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పూజలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఛాంబర్‌కి వెళ్లి సీఎస్‌కి అభినందనలు తెలిపారు. సుముహూర్త సమయంలో దస్త్రంపై సీఎస్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తమ ఛాంబర్లలో ఆశీనులై తొలి దస్త్రాలపై సంతకాలు చేశారు. హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ మార్గదర్శకాల దస్త్రంపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంతకం చేశారు.
రెండు దస్త్రాలపై సంతకాలు చేసిన మంత్రి హరీశ్‌రావు: ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రెండు దస్త్రాలపై సంతకాలు చేశారు. టీచింగ్ ఆసుపత్రుల్లో 18వందల 27 స్టాఫ్ నర్స్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ దస్త్రాలు.. ఇటీవల అకాల వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ.151. 64 కోట్ల నిధుల విడుదల ఫైల్‌పై హరీశ్ సంతకాలు చేశారు. సచివాలయంలోని మొదటి అంతస్తులో మూడు కమిషనరేట్ల జోన్ల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల మంజూరు దస్త్రంపై హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సంతకం చేశారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్స్‌కి బంధించిన మే నెల బాకాయిలు 958 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ మంత్రి జగదీశ్‌రెడ్డి... అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ, రాంజీగోండ్ మ్యూజీయానికి 10 కోట్లు మంజూరుచేస్తూ దస్త్రంపై మంత్రి సత్యవతి రాఠోడ్ సంతకాలు చేశారు.