BRAHMAYYA & CO PETITION: మార్గదర్శి కేసులో సోదాల నిమిత్తం మార్చి 28న ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసును సవాల్ చేస్తూ ఆడిట్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కొ భాగస్వామి పి.చంద్రమౌళి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కంపెనీ నుంచి 7 డెస్క్‌టాప్‌లు, 12 ల్యాప్‌టాప్‌లు, 2 హార్డ్‌డిస్క్‌ల్లోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారన్నారు. కేవలం మార్గదర్శికి చెందిన సమాచారమే కాకుండా.. తమ ఖాతాదారులందరి సమాచారం కాపీ చేసుకున్నారని తెలిపారు. దీంతో పాటు కొన్ని పత్రాలనూ తీసుకెళ్లారన్నారు. పంచనామా కూడా ఇవ్వలేదన్నారు. తమ ఖాతాదారుల సమాచారం రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు.
దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సీఐడీ అధికారులు మార్గదర్శి, సంబంధిత కంపెనీల సమాచారాన్ని మాత్రమే తీసుకెళ్లామన్నారు. ఇతర కంపెనీల సమాచారం తమకు అవసరం లేదన్నారు. పంచనామా నిర్వహించామని.., ఏం స్వాధీనం చేసుకున్నామన్న సమాచారన్ని మేజిస్ట్రేట్‌కు ఇచ్చామన్నారు. ఆడిట్ కంపెనీ కొన్ని పత్రాలను దాచిపెడుతుండటంతో సోదాలు చేయాల్సి వచ్చిందన్నారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ... పంచనామాలో పూర్తి వివరాలను పేర్కొనకపోవడంతో సంతకం చేయలేదన్నారు. కాగితాలు, డిస్క్‌లు అన్నారు తప్ప అందులో ఏం వివరాలు ఉన్నాయో చెప్పలేదన్నారు. ప్రస్తుతం వారి వాదనను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తే.. సమాచారమంతా బయటపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్గదర్శి సమాచారాన్ని విభజన చేసి తీసుకోవాలని.., అది పిటిషనర్ల ముందు జరగాల్సి ఉందన్నారు. మిగిలిన పిటిషన్ల గురించి ఆరా తీయగా.. సోదాలకు సంబంధించి మార్గదర్శి పిటిషన్లు దాఖలు చేసిందని.. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని... ఎం.వి.దుర్గాప్రసాద్ తెలిపారు.