114 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు నాటిన నీలాంబురి టేకు చెట్టుకు వేలంలో రికార్డు ధర పలికింది. అటవీ శాఖ నిర్వహించిన వేలంలో ఈ టేకును దాదాపు రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ టేకు వృక్షం ప్రభుత్వ అధీనంలోని సంరక్షణ ప్రాంతంలో కూలిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకొని వేలంలో ఉంచారు అధికారులు. నెదుంకాయం అటవీ డిపోలో దీన్ని వేలానికి ఉంచగా.. బృందావన్ టింబర్స్ యజమాని అజీశ్ కుమార్ రూ.39.25 లక్షలకు దాన్ని కొనుగోలు చేశారు. 8 క్యూబిక్ మీటర్ల మందంతో ఉన్న ఈ టేకును.. మూడు భాగాలుగా చేసి విక్రయించారు. 3 మీటర్ల పొటవు ఉన్న పెద్ద భాగానికి రూ.23 లక్షలు, మిగిలిన రెండు భాగాలకు రూ.11లక్షలు, రూ.5.25 లక్షలు చొప్పున వచ్చాయి. ఫిబ్రవరి 10న ఈ వేలం జరిగింది.
ఈ టేకును 1909లో బ్రిటిషర్లు నాటారు. ఈ టేకు చెట్లను అధికారులు సంరక్షిస్తూ ఉంటారు. కావాలని కొట్టేసిన వృక్షాలను వేలానికి ఉంచరు. ఎండిపోయి, దానంతట అదే పడిపోయిన వృక్షాలను మాత్రమే వేలం వేస్తారు. తాజా వేలంలో రికార్డు ధర రావడంపై నెదుంకాయం డిపో అధికారి షెరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ టేకుకు భారీ ధర వస్తుందని ముందుగానే ఊహించామని, అయితే ఈ స్థాయిలో అమ్ముడు పోతుందని అనుకోలేదని అన్నారు. 'ఇది అత్యంత నాణ్యమైన టేకు. ఈ ధర రావడం చాలా సంతోషంగా ఉంది. నీలాంబురి టేకు కొత్త బెంచ్మార్క్ సృష్టించినట్లైంది. నీలాంబురి టేకుకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. ప్రపంచంలోనే తొలిసారి టేకును పెంచడం ప్రారంభించింది ఇక్కడే' అని షెరీఫ్ తెలిపారు.