తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Chandrababu Fires on YSRCP: 'ఎన్​ఎస్​జీ లేకపోతే.. వివేకాలాగే నన్నూ చంపుతారేమో?'.. చంద్రబాబు ధ్వజం

TDP Chief Chandrababu Angry on YCP Leaders and Police: ప్రాణాల విలువ తెలియని రాక్షసులు.. మానవ మృగాలు.. డబ్బులు తప్ప విలువలు తెలియని మనుషులని వైసీపీ వాళ్లపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తనకు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించిందని.. లేకుంటే వివేకానందరెడ్డి తరహాలో తనపైనా గొడ్డలి వేటు వేసేవారేమో అని ఆరోపించారు.

cbn tour
cbn tour

By

Published : Aug 5, 2023, 6:46 AM IST

TDP Chief Chandrababu Angry on YCP Leaders and Police: N.S.G భద్రత లేకపోతే తనను కూడా Y.S.వివేకాను చంపినట్టే చంపేవారేమోనని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులు తప్ప మనుషుల విలువ తెలియని మానవ మృగాల్లా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వాటికి అదరేది లేదని తేల్చిచెప్పారు. పుంగనూరు ప్రాంతం 'పెద్దిరెడ్డి తాత జాగీరా' అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ చేశారు. ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ నాయకులను నియంత్రించకుండా, తెలుగుదేశం వారిపై లాఠీఛార్జి చేయించడం ఏమిటంటూ.. ఎస్పీ రిషాంత్‌రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని అంగళ్లు, పూతలపట్టు ప్రాంతంలో వైసీపీ విధ్వంసం తర్వాత.. పూతలపట్టులో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షెడ్యూల్ ప్రకారం పర్యటనకు వస్తున్న తనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తే.. ఎస్పీ ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. పైగా తెలుగుదేశం నేతల వల్లే ఘర్షణ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... అసలు IPSకు ఎలా ఎంపికయ్యారని ప్రశ్నించారు.

రెండు పార్టీల వాళ్లు రోడ్డుపైన గొడవ పడితే ఇరు వర్గాలకు సర్దిచెప్పాల్సిన ఎస్పీ, పోలీసులు.. వైసీపీ వాళ్ల నిరసనలకు మద్దతిచ్చి, తెలుగుదేశంవారిపై ఎందుకు లాఠీఛార్జ్‌ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కల్పించిన N.S.G భద్రత లేకపోతే.. Y.S.వివేకానందరెడ్డి తరహాలోనే తనపైనా గొడ్డలి వేటు వేసేవారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ జిల్లాలో ఒక గ్రేట్‌ ఎస్పీ ఉన్నారు. నీలాంటి వాళ్లు వేలమంది నా దగ్గర పనిచేశారు. నువ్వు పెద్దిరెడ్డికి ఊడిగం చేస్తున్నావా?. రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా బాధ్యతలు నిర్వహించాలి. ఆ బాధ్యతను నువ్వు చేయలేకపోవడం నీ తప్పు. రోడ్డు మీదకు వచ్చి నన్ను అడ్డుకుంటానని ప్రకటన చేస్తావా? నన్ను అడ్డుకున్న వాళ్లంతా పైకి వెళ్లిపోయారు. వైసీపీ వాళ్లు దాడులు చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారు. ఇరువురినీ పంపించాల్సి ఉన్నా మా కార్యకర్తలపైనే దాడులు చేశారు. ఇక్కడ నేను మీటింగ్​ పెట్టినప్పుడే వైసీపీ వాళ్లు వచ్చి పెట్టుకుంటామంటే ఒప్పుకొంటామా? నాపై దాడి చేసి చంపాలనుకుంటున్నారా?"-చంద్రబాబు, టీడీపీ అధినేత

చిత్తూరు జిల్లాలో వనరులన్నింటినీ దోచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం.. ప్రశ్నిస్తున్న తనపై వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించిస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. దాడులు చేయించడమే కాకుండా కుప్పంలో ఏదో చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్న పెద్దిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ చేశారు.

సంపద సృష్టించే అమరావతిని ధ్వంసం చేసిన జగన్‌.. రాష్ట్రాన్నీ సర్వనాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అనుకున్నట్లుగా అమరావతి నిర్మాణం సవ్యంగా సాగి ఉంటే.. హైదరాబాద్ కోకాపేట భూముల్లా ఇక్కడి భూములకూ బ్రహ్మాండమైన ధర ఉండేదని అన్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా మీడియాను కూడా వైసీపీ వేధిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మీడియా లేదంటూ అమాయకత్వం నటిస్తున్న జగన్‌.. సాక్షి ఎవరిదో చెప్పాలని ప్రశ్నించారు.

పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటున్న జగన్‌.. వారికివ్వాల్సిన అలవెన్సులు, టీఏ, డీఏల్లో మాత్రం కోతలు వేశారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించి, పోలీసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

స్థానిక నేత మురళీమోహన్‌ను పూతలపట్టు నియోజకర్గ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. భారీ ఆధిక్యంతో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. నేడు రేణిగుంట పరిధిలో బాలాజీ రిజర్వాయర్‌ని పరిశీలించనున్న చంద్రబాబు... మధ్యాహ్నం శ్రీకాళహస్తిలో జరిగే రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. రాత్రికి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చేరుకుని అక్కడే బస చేస్తారు.

ABOUT THE AUTHOR

...view details