తౌక్టే తుపాను వచ్చే 24 గంటల్లో మరింత ప్రమాదకరంగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గురువారం సాయంత్రానికల్లా గుజరాత్ తీరాన్ని చేరుకుంటుందని వెల్లడించింది. పోర్బందర్, మహువా(భావ్‌నగర్ జిల్లా) వద్ద గుజరాత్ తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 175 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ సహా దమణ్ దీవ్లకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ప్రస్తుతం ఎక్కడ?
గోవాలోని పంజింకు దక్షిణ నైరుతి దిక్కున 130 కిమీ, ముంబయి దక్షిణాన 450 కిమీ, వెరావల్(గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయాన 700 కిమీ, కరాచీ(పాకిస్థాన్)కి ఆగ్నేయాన 840 కిమీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో మూడు మీటర్ల ఎత్తైన అలలు ఏర్పడతాయని తెలిపింది. దమణ్ దీవ్, గిర్, సోమ్‌నాథ్, అమ్రేలీ, భరూచ్, భావ్‌నగర్, అహ్మదాబాద్, ఆనంద్, సూరత్‌లలో 2.5 మీటర్ల ఎత్తులో అలలు సంభవిస్తాయని పేర్కొంది.
షా సమీక్ష
తుపాను నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, మహారాష్ట్ర సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. దమణ్ దీవ్, దాద్రానగర్ హవేలీ అధికారులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.