బంగాల్‌లో భాజపా, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోరు రసవత్తరంగా మారిన వేళ టీఎంసీ స్థానికత అస్త్రాన్ని బయటకు తీస్తోంది. భాజపా బయటి పార్టీ అని విమర్శలు గుప్పిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కమలనాథులు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ పేరును తెరపైకి తీసుకొచ్చి ఇక్కడివారమే అని పేర్కొంటున్నారు. అఖిల భారత హిందూ మహాసభకు అధ్యక్షుడిగా సేవలందించిన శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ పార్టీనే నేడు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిందని అంటున్నారు. అలాంటప్పుడు తాము బయటివారము ఎలా అవుతామంటూ ప్రశ్నిస్తున్నారు.
ఆధునిక భారతం నుంచి హిందూ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారందరూ బంగాల్ నుంచే వచ్చారని భాజపా ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా పేర్కొంటున్నారు. కాగా శ్యామప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని భాజపా నేతలు పునికిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కుటుంబసభ్యులు తప్పుపట్టకపోయినప్పటికీ.. ముఖర్జీ కాలం నాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో పోల్చి చూసి మాట్లాడుతున్నారు. ముఖర్జీని బెంగాల్ సర్కారు ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఆక్షేపిస్తున్నారు.