Supreme Court Sedition Law Case :భారత శిక్షాస్మృతిలోని రాజద్రోహంనిబంధనకు చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు.. ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. విస్త్రృత ధర్మాసనానికి బదిలీ చేసే నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సంబంధిత పత్రాలను సీజేఐ ఎదుట ఉంచాలని.. తద్వారా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై తదుపరి చర్యలు తీసుకుంటారని రిజిస్ట్రీని ఆదేశించింది.
IPC CRPC Evidence Act New Bill :IPC, CRPC, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అందుకు సంబంధించిన బిల్లులు ప్రస్తుతం పార్లమెంటు స్థాయీసంఘం పరిశీలనలో ఉన్నట్లు గుర్తు చేసింది. అయితే కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ.. రాజద్రోహానికి సంబంధించిన 124A నిబంధన అమల్లో ఉన్నంత కాలం.. ఆ సెక్షన్ కింద విచారణ కొనసాగే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ కోణంలో నిబంధనపై మదింపు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Sedition Law Supreme Court Judgement : భారత శిక్షాస్మృతిని పునఃపరిశీలించడంపై సంప్రదింపులు కీలక దశలో ఉన్నాయని కేంద్రం చెప్పడం వల్ల మే 1న రాజద్రోహం చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 11న ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. రాజద్రోహ సెక్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు తాజా నిర్ణయం వెలువరించింది.