తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Supreme Court: 'మైనారిటీ తీరేదాకా పిల్లలను పోషించే బాధ్యత తండ్రిదే' - పిల్లల బాధ్యత ఎవరిది

తల్లిదండ్రుల గొడవలతో పిల్లలు ఇబ్బంది పడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు విడిపోయినా, మైనారిటీ తీరేవరకు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని తెలిపింది. భర్తతో కలిసి ఉండాలని భార్యను కోర్టులు ఆదేశించలేవని మరో కేసులో గుజరాత్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court
Supreme Court

By

Published : Dec 31, 2021, 12:23 PM IST

Supreme Court: తల్లిదండ్రుల మధ్య గొడవల కారణంగా పిల్లలు ఇబ్బందులు పడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు విడిపోయినా, మైనారిటీ తీరేవరకు పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత తండ్రిపై ఉందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఓ సైనికాధికారి, ఆయన భార్య విడాకుల కేసు విషయంలో పై వ్యాఖ్యలు చేసింది. వారు 2011 మే నెల నుంచి విడివిడిగా ఉంటున్నందున ఇకపై కలిసి ఉండడానికి అవకాశమే లేదని తెలిపింది. ఆ అధికారి రెండో పెళ్లి చేసుకున్నారని ఈ నేపథ్యంలో భార్య క్రూరంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తెలిపింది. ప్రస్తుతం తల్లి దగ్గర ఉన్న కుమారునికి 13 ఏళ్ల వయసు ఉందని, అతడు మేజర్‌ అయ్యే వరకు నెలకు రూ.50వేల భరణం చెల్లించాలని ఆ సైనికాధికారిని ఆదేశించింది. తల్లికి ఎలాంటి సంపాదన లేనందువల్ల, చదువు ఇతర ఖర్చుల నిమిత్తం ఇంత మొత్తం అవసరమేనని తెలిపింది.

భర్తతో కలిసి ఉండాలని కోర్టులు ఆదేశించలేవు

భర్తతో కలిసి ఉండాలని భార్యను కోర్టులు ఆదేశించలేవని గుజరాత్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై బనస్కాంఠ జిల్లా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ నిరాల్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జిల్లాలోని పలన్‌పుర్‌కు చెందిన ఓ ముస్లిం జంటకు 2010 మే 25న నిఖా జరిగింది. 2105 జులైలో వారికి కుమారుడు జన్మించాడు. ఆమె ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలని భర్త, అత్తింటివారు చెప్పడంతో ఆమె నిరాకరించారు. చివరకు 2017 జులైలో కుమారుడిని వెంటబెట్టుకొని ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. దీనిపై భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈ లోగా మరో మహిళను వివాహం చేసుకున్నాడు. కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు భర్తతో కలిసి ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ముస్లింలలో బహుభార్యత్వం ఉన్నందున అత్తవారింటికి వెళ్లాలని సూచించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆమె హైకోర్టులో సవాలు చేశారు. తనకు దేశం విడిచివెళ్లాలని లేదని, ఆ విషయమై ఒత్తిడి తెస్తున్న అత్తవారింటికి వెళ్లలేనని ఆమె తెలిపారు. దీనిని పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

"ముస్లిం పర్సనల్‌ లా బహుభార్యత్వాన్ని ఆమోదిస్తున్నా, దాన్ని పోత్సహించడం లేదు. ఇంట్లో మరో భార్య ఉన్న సమయంలోనూ తనతో కాపురం చేయాలంటూ ఆదేశించే హక్కు భర్తకు లేదు. దాంపత్య హక్కు కేవలం భర్తకు మాత్రమే లేదు. భార్యకు ఇష్టం లేకపోయినా భర్తతో కలిసి ఉండాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించలేదు" అని తెలిపింది. సమాజంలో మతాంతర, కులాంతర వివాహాలు జరుగుతున్నందున పాత సంప్రదాయాలను పక్కనపెట్టి ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:అరుణాచల్​లో మరో 15 ప్రాంతాలకు చైనా నామకరణం!

ABOUT THE AUTHOR

...view details