Supreme Court On Menstrual Leave : విద్యార్ధినులు, మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చేలా రాష్ట్రాలను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తెలిపింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది. ఈ పిల్‌ను పరిశీలించిన ధర్మాసనం.. వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయ విద్యార్థి వాదనను పరిగణనలోకి తీసుకుంది. నెలసరి సెలవులు మంజూరు చేయాలని యజమానులను బలవంతం చేస్తే.. మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారు వెనుకాడవచ్చనే వాదనతో ఏకీభవించింది.
"మేము దీనిని(సెలవు ఇవ్వాలన్న ప్రతిపాదనను) తిరస్కరించడం లేదు. కానీ ఈ కారణం చూపెట్టి అనేక మంది యజమానులు మహిళకు ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు. ఈ సమస్యకు భిన్నమైన కోణాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అవసరమైతే తర్వాత పరిశీలిస్తాము."
-- జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాన న్యాయమూర్తి