Supreme Court On Electoral Bonds : రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పథకం గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని పేర్కొంది. ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారి తెలుసుకోగలరని, అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని పేర్కొంది.
ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా రెండో రోజు విచారణ కొనసాగింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధన ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశంలో అవినీతిని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు సహా 2 లక్షల 38 వేల డొల్ల కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుందని తెలిపారు. స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసిందన్నారు. అయితే, అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని.. దీనికి కారణమేమిటని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. బాండ్ల ద్వారా సమకూరిన మెుత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని సొలిసిటర్ జనరల్ మెహతా అభిప్రాయపడ్డారు. ఈ కేసుపై ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.