Supreme Court Notices to IAS Officer Srilakshmi: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓబులాపురం మైనింగ్ కేసులో సీబీఐ అభియోగాల నమోదులో.. తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై దర్యాప్తు సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమ మైనింగ్ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన సీబీఐ.. గనుల కేటాయింపుల్లో కంపెనీకి అయాచిత లబ్ది కలిగించారని శ్రీలక్ష్మీపై ఆరోపణలు చేసింది.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీలక్ష్మి.. కుట్ర, అక్రమంగా మైనింగ్ లైసెన్సులు మంజూరు చేశారని అభియోగాలు మోపింది. అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి 2007 సంవత్సరంలో అక్రమంగా గనులు కేటాయించారని సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. కేసు కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
ఇందులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్, గాలి జనార్దన్ రెడ్డి పీఏ అలీఖాన్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని సీబీఐ ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది. గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓఎంసీ కంపెనీకి లైసెన్సుల మంజూరులో... శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించింది. ఈ అభియోగాల్లోనే 1988 బ్యాచ్‌కు చెందిన శ్రీలక్ష్మిని 2011 లో సీబీఐ అరెస్టు చేసింది. తర్వాత ఆమె బెయిల్‌పై బయటికి వచ్చారు.