తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తెండి: సుప్రీంకోర్టు - undefined

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను సైతం కేంద్రం వెనక్కి పంపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది సర్వోన్నత న్యాయస్థానం. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని స్పష్టంచేసింది.

supreme court
supreme court

By

Published : Jan 7, 2023, 8:45 AM IST

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను సైతం కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని స్పష్టంచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపిస్తోందని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తీసుకువచ్చారు. "ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని గత ఉత్తర్వుల్లోనూ లేవనెత్తాం" అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో పేర్లను ఆమోదించే ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలావధుల్లో పూర్తి చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం హామీ ఇచ్చింది.

అభ్యంతరాలుంటే చెప్పండి..ఆపకండి
సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వానికి సొంత అభిప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తం చేయాలని..అంతేగానీ ప్రతిపాదనలను పెండింగులో ఉంచడం సరికాదని జస్టిస్‌ కౌల్‌ అన్నారు. "మీ అభిప్రాయాలను తెలుపుతూ వెనక్కి పంపండి. పరిశీలిస్తాం. ఆ పేరును తిరిగి సిఫార్సు చేయాలా, తప్పించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ఆ పేరును మేం పునరుద్ఘాటించామంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియామకాన్ని ఏదీ ఆపలేదు" అని తెలిపారు. సిఫార్సుల ఆమోదంలో విపరీతమైన జాప్యం కారణంగా ప్రతిభావంతులైన జడ్జీలు న్యాయవ్యవస్థకు దూరం అవుతున్నారని జస్టిస్‌ కౌల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. "పెండింగులో ఉంచుకోవడం.. పునరుద్ఘాటించిన పేర్లను వెనక్కి పంపడం ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. దీని వల్ల ప్రతిభావంతులైన వారు జడ్జీలుగా ఉండేందుకు సమ్మతిని తెలపడం లేదు" అని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.

ఆ పేర్లను ఎందుకు పెండింగులో ఉంచారు
సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్ల పరిస్థితేంటని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కొంత గడువు కావాలని వెంకటరమణి అభ్యర్థించారు. "ఇందులో సమయం తీసుకోవడానికి ఏముంది. వారంతా ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ జడ్జీలే కదా" అని జస్టిస్‌ కౌల్‌ అన్నారు. పది మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులను పెండింగ్‌లో పెట్టడంపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.

భావజాలం ఆధారంగా అంచనా సరికాదు
న్యాయవాదుల పదోన్నతిని వారు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు లేదా వాదించిన కేసులు ఆధారంగా అడ్డుకోవడం తగదని ధర్మాసనం అభిప్రాయపడింది. "మంచి క్రిమినల్‌ న్యాయవాది నేరగాళ్ల తరఫునా వాదిస్తాడు. అంత మాత్రాన అతనిపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదు. విభిన్న భావజాలాలు ఉన్న వ్యక్తులు న్యాయవాదులుగా ఉంటారు. న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత అవి పక్కకిపోతాయి. ఏ రాజకీయ పార్టీ భావజాలానికి సంబంధించిన వారైనా, ఎలాంటి ఆలోచనా ధోరణి ఉన్నవారైనా.. న్యాయమూర్తిగా స్వతంత్రంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక రకమైన భావజాలం ఉన్నంత మాత్రాన వారు ఎవరితోనో కలిసిపోయారని అంచనాకు రావడం సరికాదు" అని ఏజీని ఉద్దేశించి జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details