తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడాదిన్నర చిన్నారి కడుపులో పిండం- ఆపరేషన్ చేస్తే... - చిన్నారి శరీరంలో పిండం

మధ్యప్రదేశ్​లోని ఓ చిన్నారి అరుదైన సమస్యతో బాధపడుతోంది. చిన్నారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నా.. అది ప్రమాదకరం కావడం వల్ల తాము నిర్వహించలేమని స్థానిక వైద్యులు చేతులెత్తేశారు. ఆ సమయంలో అహ్మదాబాద్​ సివిల్​ ఆసుపత్రిలోని వైద్యుల గురించి తెలుసుకున్న చిన్నారి తండ్రి.. వారిని ట్విట్టర్​ ద్వారా సంప్రదించాడు. చిన్నారికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు.. మూడు గంటల పాటు శ్రమించి, ఆమె శరీరంలో ఉన్న 400 గ్రాముల పిండాన్ని తొలగించారు.

fetus surgery 18 months old
ఏడాదిన్నర చిన్నారిలో పిండం!.. తొలగించిన వైద్యులు

By

Published : Aug 3, 2021, 7:45 PM IST

అరుదైన సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు గుజరాత్​ వైద్యులు. చిన్నారి శరీరంలో ఉన్న 400 గ్రాముల పిండాన్ని తొలగించారు. ఇందుకోసం వైద్యులు దాదాపు మూడు గంటలు శ్రమించారు. ప్రపంచంలో ప్రతి ఐదు లక్షల మంది చిన్నారుల్లో ఒకరికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

మధ్యప్రదేశ్​లోని నిముచ్​ జిల్లాకు చెందిన హర్షిత్​భాయ్​ కుమార్తె వేదిక. ఏడాదిన్నర వయసుగల ఆ చిన్నారికి మూడు నెలల క్రితం కడుపులో సమస్య మొదలైంది. పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు.. ఆమె శరీరంలో 400 గ్రాముల పిండం ఉందని గుర్తించారు. అయితే ఆమెకు శస్త్రచికిత్స చేసేందుకు నిరాకరించారు. ఈ ఆపరేషన్ చేయడం చాలా కష్టమని, తేడా వస్తే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారు. దీంతో నిరాశ చెందిన తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల వైద్యులను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో గుజరాత్​లోని అహ్మదాబాద్​ సివిల్​ ఆసుపత్రిలో ఈ సమస్యను నయం చేయగల వైద్యులు ఉన్నారని తెలుసుకున్న హర్షిత్​భాయ్​.. ట్విట్టర్​ ద్వారా వారిని సంప్రదించాడు.

వైద్య సిబ్బందితో చిన్నారి, తల్లిదండ్రులు

ఇందుకు సానుకూలంగా స్పందించిన వైద్యులు.. చిన్నారికి శస్త్రచికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్​ రాకేశ్​ జోషి ఆధ్వర్యంలో చిన్నారికి ఆపరేషన్​ చేశారు. మూడు గంటల పాటు శ్రమించి పిండాన్ని తొలగించారు. ఈ శస్త్రచికిత్స చాలా సంక్లిష్టమైనదని.. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి అధిక రక్తశ్రావం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎందుకిలా?

'ఫీటస్​ ఇన్​ ఫీటు'గా పిలిచే ఈ సమస్య.. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల కలుగుతుందని వైద్యులు వెల్లడించారు. ఇలాంటి సమస్యలు చాలా అరుదు అని పేర్కొన్నారు.

చిన్నారి మళ్లీ ఆరోగ్యవంతురాలు కావడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి :టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన- దిగొచ్చిన సర్కార్​

ABOUT THE AUTHOR

...view details