పెట్రోలింగ్‌లో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను(Sub inspector murdered) దొంగల ముఠా నరికి చంపేసిన ఘటన తమిళనాడు తిరుచ్చి జిల్లాలో జరిగింది. మేకలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పట్టుకునే క్రమంలో ఈ హత్య జరిగింది.
అసలేమైంది?
భూమినాథన్ (56).. నావల్పట్టు పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి (నవంబరు 20) పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. నావల్పట్టు ప్రధాన రహదారిపై మూడు ద్విచక్ర వాహనాలపై మేకలతో వెళ్తున్న అనుమానాస్పద ముఠాను భూమినాథన్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ ముఠాను ఆపిన భూమినాథన్.. వారి గురించి ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో వారు అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని చుట్టుపక్కల మేకలను దొంగిలించే ముఠాగా గుర్తించిన ఎస్‌ఐ (SI murder tamil nadu).. తన ద్విచక్ర వాహనంతో వెంబడించారు.
కలమావూరు రైల్వే గేట్ సమీపంలోని పల్లతుపట్టి గ్రామానికి ఈ ముఠా చేరుకుంది. ఆ సమయంలో భూమినాథన్ వారి ద్విచక్ర వాహనాన్ని అడ్డగించి.. ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. అయితే తప్పించుకున్న మిగిలిన ముఠా సభ్యులు (Sub Inspector hacked to death) తిరిగి వచ్చి ఘర్షణకు దిగారు. వారిని విడుదల చేసేందుకు భూమినాథన్ నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన వారు.. తమ వద్ద ఉన్న పదునైన ఆయుధాలతో ఎస్ఐను నరికేశారు. తీవ్రగాయాలై భూమినాథన్ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఉదయం 5 గంటలకు బాటసారులు.. భూమినాథన్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు.. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:కూలీ డబ్బులు అడిగినందుకు చేయి నరికేసిన యజమాని