Students Crossing The River By Rowing Thermocol Raft :మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని బివా ధనోరా గ్రామం.. ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద డ్యామ్‌లలో ఒకటైన జయక్‌వాడీ డ్యామ్‌కు సమీపంలో ఉంది. డ్యాం వెనక జలాలు, రెండు నదులు గ్రామాన్ని చుట్టుముట్టి ఉంటాయి. దైనందిన అవసరాల కోసం ప్రధాన భూభాగానికి ఆ గ్రామస్థులు వెళ్లాలంటే జయక్‌వాడీ డ్యామ్ బ్యాక్ వాటర్స్‌ను దాటి వెళ్లాలి. అందుకు అవసరమైన వంతెన మాత్రం నిర్మించలేదు. విధిలేని పరిస్థితుల్లో రోజువారీ అవసరాల కోసం మందపాటి థర్మాకోల్ షీట్లనే పడవ మాదిరిగా చేసుకుని చిన్న తెడ్లతో.. కిలోమీటరు దూరం బ్యాక్‌వాటర్‌ను దాటుతున్నారు. ఆ ఊర్లో పిల్లలు చదువుకోవాలంటే కూడా.. ఆ థర్మాకోల్ షీట్లే ఆధారం. వాటితోనే ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్యాక్‌వాటర్‌ను దాటి సమీపంలోని పాఠశాలకు వెళుతున్నారు. ఇది వారందరి దినచర్యలో భాగమైపోయింది.
స్కూల్‌కు వెళ్లాలంటే సాహసమే..
చదువుకోవాలంటే డ్యాం నీటిని దాటాల్సిందే.. అందుకే పిల్లలు రోజు పెద్ద సాహసమే చేస్తున్నారు. నీటిలో ఉండే పాములు ఒక్కోసారి థర్మాకోల్ షీట్లపైకి పాకుతూ వచ్చేస్తాయి. ఒక వెదురు కర్రతో నీటి పాములను ఎదుర్కొంటూ.. రోజూ డ్యాం నీటిని దాటుకుని బడికి వెళుతున్నట్లు పిల్లలు చెబుతున్నారు. 47ఏళ్లుగా ఆ గ్రామంలో చదువుకునే విద్యార్థులకు ఈ కష్టాలు తప్పడం లేదు. ఆధునిక సాంకేతికతో.. చంద్రయాన్-3ని జాబిల్లికిపైకి చేర్చిన మన దేశంలో కనీస అవసరమైన వంతెన లేకపోవడం బాధకరమని.. పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారుల చుట్టూ తిరిగి వంతెన కట్టమని దశాబ్దాలుగా తిరుగుతున్నా ప్రయోజనంలేదని గ్రామస్థులు చెబుతున్నారు. తమ పిల్లలను.. నిరక్ష్యరాస్యులుగా వదిలి పెట్టలేక ప్రమాదమని తెలిసి కూడా.. థర్మాకోల్ షీట్లపై పంపుతున్నట్లు తెలిపారు. నీటిపై నదిని దాటడంకంటే కూడా ప్రమాదరమైన పాముల నుంచి రక్షించుకోవడం మరింత పెద్ద సమస్యగా మారుతోందని వారు చెబుతున్నారు.
థర్మాకోల్ షీట్లపై ప్రయాణం..
శంభాజీ నగర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బివా ధనోరా గ్రామానికి.. రెండు వైపుల శివ్నా నది, ఒక వైపు జయక్‌వాడీ డ్యాం బ్యాక్‌వాటర్.. చుట్టుముట్టి ఉంది. మరోవైపు లహుకి నది ఉంది. జయక్‌వాడీ డ్యాం వెనక జలాలను దాటాలంటే కిలోమీటరు దూరం థర్మాకోల్ షీట్లపై ప్రయాణిస్తే సరిపోతుంది. లేదంటే మరో మార్గం కూడా ఉంది. దాదాపు 25 కిలోమీటర్లు బురద మట్టిలో కాలినడకన ప్రయాణిస్తే ఒక రోడ్డుకు చేరుకోవచ్చు. అంతదూరం బురదమట్టిలో రానుపోను ప్రయాణించలేక గ్రామస్థులు, విద్యార్థులు అందరూ బ్యాక్‌వాటర్‌ను దాటే వెళుతున్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ, వాతావరణం బాగాలేకున్నా కూడా విద్యార్థులు మాత్రం రోజూ బడికి వస్తున్నారని పిల్లలు చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం..
లహుకి నదిపై వంతెన నిర్మిస్తే తమకు మేలు జరుగుతుందని.. గ్రామస్థులు చెబుతున్నారు. అయితే జయక్‌వాడీ డ్యాం కట్టినప్పుడే.. ఆ గ్రామస్థులందరికీ పునరావాసం కల్పిస్తామని చెప్పినా కొందరు అక్కడే ఉండిపోయారని స్థానిక తహశీల్దార్ చెబుతున్నారు. వారి పిల్లలే ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో నీటిని దాటుతున్నారని వెల్లడించారు. పునరావాసం కోసం అప్పట్లోనే వారికి ప్లాట్లు కేటాయించారన్న తహశీల్దార్.. అయితే వాటి రికార్డులు ఇప్పుడు అందుబాటులోలేవని చెప్పారు. ఎమ్మెల్సీ సతీష్ చవాన్.. గ్రామస్థుల సమస్యను మహారాష్ట్ర శాసనమండలిలో ప్రస్తావించినా ఇంకా పరిష్కారం దొరకలేదు.