మహారాష్ట్రలోని నాశిక్‌లో ఓ రైల్వే పోలీసు అధికారి.. సొంత పిల్లలపైనే అమానుషత్వం ప్రదర్శించాడు. రెండో భార్యతో కలిసి.. తన కుమారుడు హిమాన్షు మోరె(పదేళ్లు), కుమార్తె ప్రియాన్షు మోరె(ఐదారేళ్లు)లను చితకబాదాడు. ఈ ఘటనలో ఆ చిన్నారులిద్దరి శరీరం ఎర్రగా కందిపోయింది. మొహంతో పాటు ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా సంచలనం రేపిన ఈ ఘటన.. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది..
రైల్వే విభాగంలో పోలీసు సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తున్నాడు రాహుల్ మోరె. తన మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. ఇద్దరు పిల్లల బాగోగుల్ని చూసుకునేందుకు మరో పెళ్లి చేసుకున్నాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో.. ఆ పిల్లలపై ఆగ్రహం పెంచుకుందా పినతల్లి. ఆమె చెప్పుడు మాటలు విన్న రాహుల్.. అమాయకమైన ఆ చిన్నారులపై ప్రతాపాన్ని చూపించాడు. ఇద్దరూ కలిసి విచక్షణ రహితంగా కొట్టారు. ఈ నెల 15న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఈ విషయం తెలిసిన పిల్లల మామయ్య నీలేశ్ తడ్కర్.. తక్షణమే చిన్నారులను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స ఇప్పించారు. రాహుల్, అతడి భార్యపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:'రైతుల ఆదాయం రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యం'