కరోనా కారణంగా అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ డబ్బును చిన్నారుల పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామన్న స్టాలిన్.. వారికి 18 ఏళ్లు వచ్చిన తర్వాత వడ్డీతో సహా తీసుకోవచ్చని ప్రకటించారు.
అనాథలకు అండగా సీఎం- రూ. 5లక్షల సాయం - అనాథ పిల్లలపై స్టాలిన్
కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు ఆపన్నహస్తం అందించేందుకు తమిళనాడు సర్కారు ముందుకొచ్చింది. అనాథలైన వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు స్టాలిన్ ప్రకటించారు.
తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారులకు సైతం రూ.3లక్షల సాయం అందజేస్తామని స్టాలిన్ తెలిపారు. అంతేగాక, అనాథలైన చిన్నారుల సంరక్షణ, చదువు బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూస్తుందని సీఎం తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేంతవరకు వారి చదువు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్న స్టాలిన్.. ప్రభుత్వ వసతి గృహాల్లో వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. వసతి గృహాల్లో కాకుండా తమ బంధువుల ఇళ్లల్లో ఉండాలనుకునే వారికి 18ఏళ్లు వచ్చేవరకు ప్రతి నెలా 3వేలు అందజేస్తామని ప్రకటించారు. పిల్లల సంరక్షణ బాధ్యతలను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:'మోదీ కాళ్లు పట్టుకునేందుకూ సిద్ధమే!'