తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కల్తీ మద్యానికి 12 మంది బలి.. ప్రాణాపాయ స్థితిలో అనేక మంది..

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విళుపురం, చెంగల్పట్టు జిల్లాలో రెండు చోట్లు ఆ ఘటన జరిగింది.

Spurious liquor kills several people in Tamil Nadu
తమిళనాడులో కల్తీ మద్యం తాగి పలువురు మృతి

By

Published : May 15, 2023, 9:43 AM IST

Updated : May 15, 2023, 12:45 PM IST

తమిళనాడులో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. దాదాపు 25 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ కల్తీ మద్యం కలకలం సృష్టించింది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. సముద్ర తీరంలో ఉన్న ఓ మద్యం దుకాణంలో బాధితులు మద్యం తాగారని.. అనంతరం ఇంటికి వచ్చి స్పృహ కోల్పోయారని పోలీసులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. బాధితుల్లో కొంత మంది చికిత్స పొందుతూనే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. విళుపురం జిల్లా మరక్కాణం ప్రాంతానికి చెందిన అమరన్‌ అనే వ్యక్తి.. సముద్ర తీరంలోని వంబామేడు ప్రాంతంలో మద్యం అమ్ముతుంటాడు. అతడి వద్ద ఆదివారం ఎక్కియార్‌కుప్పం జాలరి గ్రామానికి చెందిన కొందరు ఈ మద్యాన్ని తాగారు. అనంతరం ఇంటికి వెళ్లిన వారిలో చాలా మంది స్పృహ కోల్పోయారు. వెంటనే కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే శంకర్‌ (55), సురేష్‌(65), ధరణివేల్‌ (50), రాజమూర్తి (55), మలర్విళి (60) చనిపోయారు. వీరే కాకుండా మరో ముగ్గురు కూడా మృతి చెందారు. ఘటనకు కారణమైన అమరన్​​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్​కు పంపినట్లు వారు వెల్లడించారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని పేర్కొన్నారు. మద్యంలో ఇథనాల్-మిథనాల్​తో కూడిన పదార్థాలు కలపవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

చెంగల్పట్టు జిల్లాల్లోని చితమూరు ప్రాంతంలో మరో నలుగురు చనిపోయారు. వారిలో ఇద్దరు భార్యభర్తలు కూడా ఉన్నారు. మొదట భార్యాభర్తలు.. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావించారు. అనంతరం వారు చనిపోయిన ఆనవాళ్ల ఆధారంగా మద్యం తాగే మరణించినట్లుగా పోలీసులు నిర్ధరించారు. ఆ తరువాత మరో ఇద్దరు కూడా ఇవే లక్షణాలతో ఆసుపత్రిలో చేరి చనిపోయారు. ఇంకొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో సంబంధమున్న అమ్మవాసాయి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇక్కడ కూడా మద్యంలో ఇథనాల్​, మిథనాలు కలిపినట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

"బాధితులంతా కల్తీ మద్యం తాగి వాంతులు, కళ్లు మంటలు, తలనొప్పితో బాధ పడుతూ ఆసుపత్రిలో చేరారు. ఈ రెండు ఘటనలతో సంబంధమున్న మరికొంత మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి మరి గాలింపులు జరుపుతున్నాం. మొత్తంగా తొమ్మిది మంది నిందితులను అరెస్ట్​ చేశాం." అని పోలీసుల తెలిపారు. ఘటనపై మొత్తంగా 57 కేసులు నమోదు చేసినట్లు వారు వెల్లడించారు. కాగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన విల్లుపురం జిల్లా మరక్కాణం పరిధిలోని ఇద్దరు ఇన్స్​స్పెక్టర్​లను, మరో ఇద్దరు సబ్​-​ఇన్స్​స్పెక్టర్​లను సస్పెండ్ చేసినట్లు పోలీసు ఉన్నాధికారులు తెలిపారు. అదే విధంగా చెంగల్పట్టు ఘటనలో ఒక ఇన్స్​స్పెక్టర్​ను, ఇద్దరు ఇన్స్​స్పెక్టర్​లను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు వారు వెల్లడించారు.

కల్తీ మద్యం తాగి జవాన్​తో సహా ముగ్గురు మృతి.. పెళ్లైన రెండో రోజే..
ఛత్తీస్​గఢ్​లో ​కల్తీ మద్యం తాగి ముగ్గురు యువకులు మృతి చెందారు. జాంజ్‌గిర్ చంపా జిల్లాలోని నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మృతులను రోక్​డా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో నందలాల్ కశ్యప్ అనే ఓ ఆర్మీ జవాన్​ కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన పెళ్లి జరిగింది. ఘటన జరిగిన రోజు విందు కార్యక్రమం జరగాల్సి ఉంది. దానికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి మిత్రులు, తన బంధువులతో మద్యం తాగారు నందలాల్ కశ్యప్. అనంతరం అందులో ముగ్గురు ఒక్కొక్కరుగా మూర్ఛపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయిన ఫలితం లేకపోయింది. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Last Updated : May 15, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details