Split In JDS 2023 :బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఇటీవలే చేరగా.. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ C.M ఇబ్రహీం కీలక ప్రకటన చేశారు. ఎన్డీఏలో జేడీఎస్ చేరదంటూ.. పార్టీ అధినేత దేవెగౌడ నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడారు. పార్టీలో చీలిక ఏర్పడ్డట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. తమదే అసలైన 'సెక్యులర్' వర్గమని ప్రకటించుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని ఆ పార్టీ అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేశారు. సోమవారం.. ఆయన తమ పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడారు.
"బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరబోమనేది మా తొలి నిర్ణయం. పొత్తుకు అంగీకరించవద్దని అధినేత దేవెగౌడకు విజ్ఞప్తి చేయడం రెండో నిర్ణయం. బీజేపీ- జేడీఎస్ పొత్తు తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో పలువురు జేడీఎస్ నేతలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో నేటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దేవెగౌడకు తెలియజేస్తాను"
-- C.M ఇబ్రహీం, జేడీఎస్ కర్ణాటక చీఫ్
'వాళ్లు వెళ్తే వెళ్లనివ్వండి'
JDS Party Split 2023 : జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి.. తన నిర్ణయంతో ఏకీభవించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంటన్న ప్రశ్నపై ఇబ్రహీం బదులిచ్చారు. "నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో పార్టీకి సంబంధించి నిర్ణయాలు నేను తీసుకోవాలి. బీజేపీతో వెళ్లబోమని ఇప్పటికే తేల్చి చెప్పేశాం. ఇంతకంటే ఇంకేముంది?" అని సమాధానమిచ్చారు. ఒకవేళ దేవెగౌడ, కుమారస్వామి బీజేపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లయితే వెళ్లనివ్వండంటూ వ్యాఖ్యలు చేశారు.