SP MLA Shahjil Islam: ఉత్తర్‌ప్రదేశ్‌లో బుల్డోజర్ కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు అత్యాచారం, ఇతర కేసుల్లో నిందితుల ఆస్తులపై బుల్డోజర్ ప్రతాపం చూపించగా.. ఈసారి ఆ జాబితాలో ఏకంగా ఓ శాసనసభ్యుడు చేరారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే షాజిల్ ఇస్లామ్ అన్సారీకి చెందిన పెట్రోల్ బంక్‌ను అధికారులు గురువారం కూల్చేశారు. బరేలీ-దిల్లీ జాతీయ రహదారిపై పర్సాఖేడా వద్ద ఉన్న బంక్‌ను అక్రమంగా నిర్మించారన్నది వారి వాదన. ఇదే విషయంపై ఇప్పటికే నోటీసులు ఇచ్చినా స్పందన లేదని.. అందుకే ఈ చర్యలు చేపట్టినట్టు చెప్పారు బరేలీ అభివృద్ధి ప్రాధికార సంస్థ(బీడీఏ) వైస్ ఛైర్మన్ జోగేంద్ర సింగ్.
వారం క్రితం మొదలు: ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్సారీపై వారం క్రితమే బరేలీ బరాదరి ఠాణాలో కేసు నమోదైంది. గత శుక్రవారం సొంత నియోజకవర్గం భోజిపురాలో ఓ సభలో మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అన్సారీ. "ఇటీవల ఎన్నికల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభలో మన పార్టీ(ఎస్పీ) బలం పెరిగింది. ఆదిత్యనాథ్ ఇకపై ఏదైనా చప్పుడు చేస్తే ఎస్పీ తుపాకుల నుంచి పొగ రాదు.. తూటాలు దూసుకొస్తాయి" అని అన్నారు అన్సారీ. హిందూ యువ వాహిని సభ్యుడి ఫిర్యాదుతో ఎమ్మెల్యే సహా మరికొందరు ఎస్పీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెదిరించడం, శాంతిభద్రతలు విఘాతం కలిగించడం, అల్లర్లు సృష్టించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు పెట్టారు.