Smart Cap For Blind : అంధులను చూసి చలించిపోయిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి.. వారి కోసం కష్టపడి స్మార్ట్క్యాప్ను తయారు చేశాడు. రోడ్డు దాటేందుకు అంధులు పడుతున్న కష్టం చూసిన అతడు.. ఇంట్లోని వస్తువులతోనే వారికి ఉపయోగపడేలా పరికరం రూపొందించాడు.
బంగాల్లోని హుగ్లీ సమీపంలోని చందన్నగర్కు చెందిన ఆదిత్య రాయ్.. 9వ తరగతి చదువుతున్నాడు. ఆదిత్య తండ్రి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. ఆదిత్యకు చిన్నప్పటి నుంచే ఎలక్ట్రానిక్ వస్తువులంటే ఆసక్తి. వాటిని రిపేర్ చేయడం.. భాగాలుగా విడగొట్టి మళ్లీ బిగించడం చేస్తుండేవాడు. ఆ ఇష్టంతోనే రకరకాల వస్తువులు తయారు చేయడం మొదలుపెట్టాడు ఆదిత్య. ఇప్పుడు ఏకంగా అంధుల కోసం ప్రత్యేకంగా స్మార్ట్ క్యాప్‌ను తయారు చేసి ఔరా అనిపించాడు. ఈ క్యాప్‌ను పెట్టుకుంటే అంధులు సులువుగా రోడ్డును దాటేయవచ్చు.
ఆదిత్య రూపొందించిన ఈ స్మార్ట్ క్యాప్‌లో అల్ట్రా సోనిక్ సిస్టమ్ ఉంది. ఈ క్యాప్ పెట్టుకునేవారి ముందు ఏదైనా వస్తువు లేదా వాహనం వచ్చినప్పుడు శబ్దం చేస్తుంది. అప్పుడు అప్రమత్తం అవ్వొచ్చు. అంతేకాకుండా ఈ క్యాప్‌లో బ్లూటూత్ హెడ్‌ఫోన్, జీపీస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఈ పరికరాలు సోలార్ ఛార్జర్‌తో పని చేస్తాయి. ఈ స్మార్ట్ క్యాప్‌ను ప్లాస్టిక్ వస్తువులతో తయారు చేశాడు ఆదిత్య.
పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆదిత్యకు అంధులు కనిపించేవారు. వారు రోడ్డు దాటడానికి పడుతున్న కష్టాలను గమనించాడు. అలాంటి వారి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడే అతడికి స్మార్ట్ క్యాప్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రయోగాత్మకంగా స్మార్ట్ క్యాప్‌ను తయారు చేసి తన సత్తాను చాటుకున్నాడు ఆదిత్య.