ఆరేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. స్నేహితురాలితో కలిసి పొలానికి వెళ్లిన బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ బాలుడు. కరౌలి జిల్లా మంచారి పోలీసు స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు వెళ్లిన బాలిక మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఇంటికి వచ్చింది. అనంతరం తన స్నేహితురాలితో కలిసి పొలానికి వెళ్లింది. ఆ సమయంలో నిందితుడు పొలం దగ్గరే ఉన్నాడు.
ఆరేళ్ల బాలికపై బాలుడు అత్యాచారం.. గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి - గుండెపోటు క్లాస్ రూంలోనే చనిపోయిన విద్యార్థి
ఆరేళ్ల బాలికపై ఓ బాలుడు అత్యాచారం చేశాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. పొలానికి వెళ్లిన బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు ఆ బాలుడు. గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కర్ణాటకలో జరిగింది
మొదట బాధిత బాలిక చెప్పులను పంట పోలాల వైపు విసిరేశాడు బాలుడు. దీంతో బాలిక చెప్పుల కోసం వెళ్లింది. బాలికతో పాటే వెళ్లిన బాలుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విన్న తన స్నేహితురాలు భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఘటన అనంతరం ఏడుస్తూ ఇంటికొచ్చిన బాలిక.. తండ్రికి జరిగిన విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపులు జరుపుతున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.
గుండెపోటుతో నాలుగో తరగతి విద్యార్థి మృతి:
నాలుగో తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుతో చనిపోయిన ఘటన కర్ణాటకలో శుక్రవారం జరిగింది. గత కొద్ది రోజులుగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న బాలుడు హఠాత్తుగా స్కూల్లోనే కుప్పకూలాడు. స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. హుబ్లీ కలఘటగి పట్టణానికి చెందిన ముక్తం మహ్మదాఫ్రి మన్యరా.. ప్రభుత్వ ప్రాథమిక బాలుర పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఉదయం స్కూల్‌కి వెళ్లిన బాలుడు తరగతి గదిలోనే గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబం దుఃఖంలో మునిగిపోయింది.