తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సిద్ధూ హత్యకు తిహాడ్ జైలులో కుట్ర!.. న్యాయ కమిషన్​తో దర్యాప్తు - sidhu moose wala death plan tihar jail

Sidhu Moose wala death news: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసుపై దర్యాప్తు కోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. దోషులను విడిచిపెట్టేది లేదని అన్నారు. మరోవైపు, దిల్లీలోని తిహాడ్ జైలులో సిద్ధూ హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

MOOSEWALA MANN
MOOSEWALA MANN

By

Published : May 30, 2022, 4:57 PM IST

Updated : May 30, 2022, 6:19 PM IST

Sidhu Moose wala death news: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘటన దర్యాప్తు కోసం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దీనిపై పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు. తమ కుమారుడి హత్యపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ సిద్ధూ తండ్రి లేఖ రాసిన నేపథ్యంలో.. సీఎం భగవంత్‌ మాన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ కేసులో దోషులను వదిలిపెట్టే సమస్యే లేదని మాన్ స్పష్టం చేశారు. న్యాయ విచారణకు పంజాబ్‌ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. అవసరమైతే ఎన్ఐఏ దర్యాప్తు కూడా కోరతామన్నారు.

మరోవైపు, ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూసినట్లు మూసేవాలా తండ్రి బల్​కౌర్ సింగ్ పేర్కొన్నారు. సిద్ధూ తనతో పాటు సెక్యురిటీ గార్డ్స్​ను తీసుకెళ్లలేదన్న విషయాన్ని గ్రహించి.. గార్డ్స్​తో సహా అతడు ఉన్న ప్రాంతానికి వెళ్లినట్లు తెలిపారు. సిద్ధూతో పాటు కారులో ఉన్న ఇద్దరినీ తానే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు.

'డబ్బుల కోసం కొందరు గ్యాంగ్​స్టర్​లు సిద్ధూను బెదిరించేవారు. ఆదివారం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని, గార్డ్స్​ను సిద్ధూ తన వెంట తీసుకెళ్లలేదు. సిద్ధూకు ప్రాణహాని ఉందనే.. గార్డ్స్​ను తీసుకొని అతడి వద్దకు వెళ్లాను. జవహార్ కే గ్రామానికి చేరుకోగానే ఓ కరోలా కారు సిద్ధూ వాహనాన్ని వెంబడించడం గమనించా. బర్నాలా గ్రామం వైపు సిద్ధూ వెళ్లగానే ఓ బొలెరో అతడిని అడ్డగించింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. కరోలా, బొలెరోలో ఉన్నవారంతా ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. తర్వాత దుండగులు పారిపోయారు' అని సిద్ధూ తండ్రి బల్​కౌర్ వివరించారు.

కాగా, సిద్ధూను తాను గ్యాంగ్​స్టర్ అని పేర్కొనలేదని పంజాబ్ డీజీపీ వీకే భావ్రా స్పష్టం చేశారు. అతడికి గ్యాంగ్​స్టర్లతో సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పలేదని అన్నారు. గ్యాంగ్​వార్​లో భాగంగానే ఈ హత్య జరిగి ఉంటుందని భావ్రా చెప్పారని సిద్ధూ తండ్రి.. సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందుకు డీజీపీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన డీజీపీ.. సిద్ధూ మూసేవాలా అంటే తనకు ఎంతో గౌరవమని స్పష్టం చేశారు. పంజాబ్ సంస్కృతికి అతడు ఐకాన్ అని పిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

తిహాడ్ జైలు నుంచి కుట్ర!
ఇక, సిద్ధూ హత్య గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగర్ హత్యకు తిహాడ్ జైలు నుంచే కుట్ర జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో ఒకరి ఫోన్ నంబర్ వివరాలు ఆరా తీయగా.. తిహాడ్ జైలు గురించి తెలిసిందని అధికారులు చెప్పారు. 'కొద్ది రోజుల క్రితం షారుఖ్‌ అనే నేరస్థుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడు మెసేజింగ్‌ యాప్‌ ద్వారా గోల్డీ బ్రార్‌తో సంభాషణ జరిపాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది' అని అధికారులు వివరించారు.

బిష్ణోయ్‌కు అత్యంత సన్నిహితుడైన గ్యాంగ్​స్టరే గోల్డీ బ్రార్‌. సిద్ధూ హత్యకు తామే బాధ్యులమని ఆదివారం ఫేస్​బుక్ పోస్టు ద్వారా గోల్డీ బ్రార్ ప్రకటించాడు. ఫలితంగా ఆ దిశలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బిష్ణోయ్‌ను ప్రశ్నించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బిష్ణోయ్ మరో కేసులో రాజస్థాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

కాగా, సిద్ధూ హత్యకు సహకరించిన ఆరుగురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాదూన్​లోని పెలియోన్ పోలీస్ చౌకీ ప్రాంతంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హంతకులకు వీరంతా సహకరించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడికి వాహనం అందించి, ఆశ్రయం కల్పించిన వ్యక్తినీ అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులంతా ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని హేమకుండ్ సాహిబ్​ను సందర్శించుకొని పంజాబ్​కు వెళ్తున్నారని.. వీరిని శిమ్లా బైపాస్ వద్ద ఉత్తరాఖండ్ ఎస్​టీఎఫ్ అడ్డుకుందని అధికారులు స్పష్టం చేశారు. నిందితులను పంజాబ్​కు తీసుకొస్తున్నట్లు తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో సిద్ధూ మూసేవాలా ఘటన తొలి హత్యేమీ కాదని ఆరోపించారు. పంజాబ్​లో ఆప్ అధికారంలోకి వచ్చాక 90 హత్యలు జరిగాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి సిద్ధూ ఘటన ఓ సాక్ష్యమని చెప్పుకొచ్చారు.

Sidhu Moose Wala death: ఆదివారం సాయంత్రం సిద్ధూ తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిద్ధూ ప్రాణాలు కోల్పోయారు. సిద్ధూకు కల్పిస్తున్న భద్రతను పంజాబ్‌ ప్రభుత్వం కుదించిన మరుసటి రోజే ఈ ఘోరం జరగగా.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధూకు భద్రత తగ్గింపుపై దర్యాప్తు చేపట్టాలని సీఎం భగవంత్‌ మాన్‌ ఆదేశించారు.

శాంతిభద్రతల కారణం చూపుతూ సిద్ధూ మూసేవాలాతో పాటు మొత్తం 424 మంది ప్రముఖుల భద్రతను పంజాబ్‌ సర్కారు కుదించింది. వీరిలో పలువురికి భద్రతను ఉపసంహరించుకుంది. సిద్ధూకు ఇన్నాళ్లూ నలుగురు కమాండోలు రక్షణగా ఉండేవారు. అందులో ఇద్దరిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మిగిలిన ఇద్దరిని ఆయన ఆదివారం తన వెంట తీసుకెళ్లలేదు. సిద్ధూకు సొంతంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఉన్నప్పటికీ.. దాన్ని కూడా వినియోగించలేదు. ఈ క్రమంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు.

ఇదీ చదవండి:

Last Updated : May 30, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details