Shimla Landslide Temple : హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలు అనేక కుటుంబాల్లో తీరని వేదనను మిగిల్చాయి. ఓ కుటుంబంలో మూడు తరాలను బలి తీసుకోగా.. మరో కుటుంబం ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఇప్పటి వరకు భారీ వరదలు, కొండచరియలు సృష్టించిన బీభత్సానికి సుమారు 60 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోంది.
Shimla Landslide Death Toll :సోమవారం సమ్మర్ హిల్ శివాలయంపై విరిగిపడిన కొండచరియలు ఓ కుటుంబంలో మూడు తరాలను బలి తీసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి ఐదుగురు మరణించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. పవన్ శర్మ అనే వ్యక్తితో పాటు అతడి భార్య సంతోష, కుమారుడు అమన్, కోడలు అర్చన, ముగ్గురు మనవరాళ్లు సోమవారం శివాలయానికి వెళ్లారు. ఒక్కసారిగా కొండచరియలు శివాలయంపై విరిగిపడడం వల్ల వారంతా గల్లంతయ్యారు. ఇందులో ఐదుగురి మృతదేహాలను వెలికితీయగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. మిగిలిన వారిని ఎలాగైనా గుర్తించాలని మృతుల బంధువులు కోరుతున్నారు. వారి కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీశారు.
తమ్ముడిని రక్షించబోయి అన్న మృతి
మరోవైపు ఫాగ్లిలో విరిగిపడిన కొండచరియలు ఒకే కుటుంబంలో ఇద్దరు సోదరుల ప్రాణాలను బలి తీసుకుంది. శిథిలాల కింద చిక్కుకుని ఆపదలో ఉన్న సోదరుడిని కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు ఓ న్యూస్ రీడర్. సలావుద్దీన్ బాబర్ అనే వ్యక్తి ఆకాశవాణిలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్నాడు. రోజూలాగే సోమవారం ఉదయాన్నే ఇంట్లో పనుల్లో నిమగ్నం కాగా.. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన సలావుద్దీన్ బయటకు వచ్చాడు. కానీ అతడి సోదరుడు శిథిలాల్లో చిక్కుకుపోయాడు. దీనిని గమనించిన సలావుద్దీన్ వెంటనే అక్కడికి చేరుకుని సోదరుడిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే మరోసారి కొండచరియలు విరిగిపడడం వల్ల సలావుద్దీన్ సైతం శిథిలాల్లో కూరుకుపోయాడు. అనంతరం అధికారులు సహాయక చర్యలు చేపట్టగా సోదరులు ఇద్దరూ శవాలుగా కనిపించారు. ఈ ప్రమాదంలో వీరితో సహా ఐదుగురు మరణించారు.
Himachal Pradesh Flood News 2023 : మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజధాని శిమ్లాలోని సమ్మర్ హిల్స్, కృష్ణా నగర్, ఫాగ్లి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన చోట్ల మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. ఈ మూడు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా.. సమ్మర్ హిల్స్‌లో బుధవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. సమ్మర్ హిల్స్‌లో మొత్తం 21 మృతదేహాలను గుర్తించిన సహాయ సిబ్బంది.. ఫాగ్లిలో ఐదు, కృష్ణానగర్‌లో రెండింటిని వెలికితీశారు. కొండచరియలు విరిగిపడడం వల్ల సోమవారం కూలిపోయిన ఆలయంలో.. చాలామంది సజీవ సమాధి అయ్యారు. కృష్ణానగర్‌లో మంగళవారం కొండచరియలు విరిగిపడి 8 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సోలన్ జిల్లాలో భారీ వర్షాలకు ఏడుగురు మరణించారు. వరదల్లో చిక్కుకున్న సుమారు 800 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ముఖ్యమంత్రి సుఖ్విందర్‌సింగ్ విడుదల చేశారు.