నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ తీసుకురాగానే మరో చీతా నిర్దేశిత ప్రాంతం దాటిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీర్పుర్ ప్రాంతంలోని బఫర్ జోన్‌లోని వెళ్లిపోయింది. ఆశా ఎక్కువగా బఫర్ జోన్‌లోని నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా ఆశాకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు.
అయితే, ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జంతువులను వేటాడవని.. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. కానీ బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
అంతకుముందు కూడా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాల్లో ఒకటి నిర్దేశిత ప్రాంతం దాటి వెళ్లింది. ఒబాన్ అనే చీతా కూనో నేషనల్ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని బరోడా గ్రామంలో ప్రత్యక్షమైంది. అక్కడి పొలాల్లో చీతా దాక్కున్నట్లు స్థానికులు గుర్తించారు. ఇటీవలే ఆ చీతాను కూనో నేషనల్ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్‌లోకి మార్చారు. చీతా జాడ కనిపించకపోవడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు.
నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో.. ఇప్పటి వరకు నాలుగింటిని కూనో నేషనల్ పార్కు నుంచి ఫ్రీ ఎన్‌క్లోజర్లలోకి విడిచిపెట్టారు. ఒబాన్, ఆశాను మార్చి 11న విడిచి పెట్టగా.. ఫ్రెడ్డీ, ఎల్టల్‌ను మార్చి 22న విడిచిపెట్టారు. కాగా ఒబాన్ అడవి నుంచి తప్పిపోయి.. జనావాసాల్లోకి చొరబడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళన గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు అనేక ప్రయత్నాల అనంతరం ఒబాన్‌ను సురక్షితంగా కూనో నేషనల్ పార్కుకు తీసుకువచ్చారు.