Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసిన రోజే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో విందులో పాల్గొన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దిల్లీలోని ఆయన నివాసంలోనే జరిగిన ఈ విందు కార్యక్రమానికి రౌత్‌తో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మంగళవారం ఈ పరిణామాలు జరగ్గా.. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేక సమావేశమయ్యారు పవార్. పార్లమెంటులో దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది.
Sharad Pawar Modi Meet: మోదీతో భేటీ అనంతరం పవార్ మీడియాతో మాట్లాడారు. రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కేంద్ర సంస్థలు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు పూర్తి బాధ్యత కూడా వాళ్లదే అని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినందుకే రౌత్‌ను ఈడీ లక్ష్యంగా చేసుకుందని పవార్ ఆరోపించారు.