people died falling in well: ఉత్తర్ప్రదేశ్ ఖుషీనగర్లో ఘోరం జరిగింది. బావిలో పడి 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వివాహానికి ముందు నిర్వహించిన హల్దీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
పరేమేశ్వర్ కుష్వాహా అనే వ్యక్తికి సంబంధించిన వివాహ వేడుక నెబువా నౌరాంగియాలో నిర్వహించారు. హల్దీ కార్యక్రమానికి భారీగా అతిథులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో 50-60 మంది మహిళలు, బాలికలు ఓ బావి దగ్గర వేడుకలు చేసుకున్నారు. ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కొంతమంది నిల్చున్నారు. అయితే, దురదృష్టవశాత్తు కంచె విరిగిపోవడం వల్ల.. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి.. వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో 13 మంది మరణించారని వైద్యులు నిర్ధరించారు.