Jaishankar Oil Imports: రష్యా నుంచి పెద్దఎత్తున ముడిచమురు, బొగ్గును దిగుమతి చేసుకొంటూనే భారత్‌కు శ్రీరంగనీతులు చెప్పడాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుపట్టింది. భారత్ కంటే చాలా ఎక్కువగా ముడిచమురు, బొగ్గు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్న ఐరోపా దేశాలు పైకి మాత్రంపుతిన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని, రష్యాను ఏకాకిని చేయాలని వారి ఆర్థిక వ్యవస్థను అల్లాడించాలని బీరాలు పలకడం ఏంటని భారత్ ప్రశ్నిస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్‌పై యుద్ధం చేసిన రష్యాపై ఆంక్షలు విధించిన ఐరోపా, అమెరికాలే మాస్కో వాణిజ్యాన్ని నిలబెడుతున్నాయి.
ఓ వైపు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తూనే మరోవైపు రష్యా నుంచి సింహభాగం గ్యాస్, చమురు ఇతర కొనుగోళ్లు చేస్తూ ఆ దేశ ఖజానా నింపుతున్నాయి. సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్-CREA అనే ఐరోపా స్వచ్ఛంద పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం రష్యా ఆర్థిక వ్యవస్థ యుద్ధ సమయంలో, ఆంక్షల కాలంలోనూ సజావుగానే సాగుతోందని స్పష్టమైంది. దీనికంతటికీ మూలకారణం ఐరోపా దేశాల చమురు, గ్యాస్ అవసరాలేనని తేటతెల్లమైంది. వాటికోసం ఆయా దేశాలు రష్యాపై ఆధారపడుతూనే ఉన్నాయి.
నిరుటితో పోలిస్తే గత 8 నెలల్లో రష్యా సగటు ఎగుమతుల 60 శాతం ఎక్కువగా ఉన్నాయని CREA నివేదిక ద్వారా వెల్లడైంది. ఆంక్షలు విధించిన తొలి నాళ్లలోనే రష్యా విక్రయించిన శిలాజ ఇంధనాల్లో..ఐరోపా సమాఖ్య వాటా 61 శాతం. వీటి విలువ 60 బిలియన్ డాలర్లు. మార్చిలోనే ఆంక్షలు విధించినప్పటికీ, ఇప్పటివరకూ ఐరోపా సమాఖ్యకు ఇంధన ఎగుమతులు రష్యా నుంచి సాగుతూనే ఉన్నాయి. శీతాకాలపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రష్యా నుంచి భారీగా గ్యాస్ కొనుగోళ్లు చేస్తున్నాయి. తమ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని సమకూర్చుకొని, నిల్వలు నిండిపోయి, ఇక దాచి పెట్టుకోవటానికి వీలులేదనే స్థితికి వచ్చాక ఇప్పుడు డిసెంబరు 5 నుంచి రష్యా ముడిచమురు దిగుమతిని ఆపేస్తున్నట్లు ఐరోపా దేశాలు ప్రకటించాయి. రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం.. ఫిబ్రవరి తర్వాత నిలిపేస్తామని చెబుతున్నాయి.
ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత అమెరికా, ఐరోపా ఆంక్షలతో ఇంధనాన్ని అమ్ముకునేందుకు రష్యా కొత్త దారులు వెతుక్కుంది. తన మిత్రదేశాలైన చైనా, భారత్, తుర్కియేలకు భారీ రాయితీలు ఇచ్చింది.ఫలితంగా ఈ దేశాలు కూడా భవిష్యత్ అవసరాలు, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని గతంకంటే ఎక్కువ మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నాయి. 2021లో 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేసిన భారత్ ఈ సారి ఆరునెలల్లోనే 60 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకుంది.