Secular Word Removed From Constitution :నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో 'సెక్యులర్', 'సోషలిస్ట్' అనే పదాలు ( Secular Socialist Removed From Preamble ) కనిపించడం లేదని కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌదరి తెలిపారు. 1976లో రాజ్యాంగ సవరణ చేసి ఈ పదాలను చేర్చినట్లు గుర్తు చేసిన అధీర్.. వాటిని తమకు ఇచ్చిన కాపీలలో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. ఇది రాజ్యాంగాన్ని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నమేనని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
"నేను రాజ్యాంగం కాపీ చదువుతున్నప్పుడు అందులో రెండు పదాలు కనిపించలేదు. వాటిని నేనే స్వయంగా అందులో చేర్చుకున్నా. దాన్ని రాహుల్ గాంధీకి కూడా చూపించా. రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని మనం పీఠికలో చేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు అవి (సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు) లేవు? తెలివిగా వాటిని తొలగించారు. మనం రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి కారణమేంటి? ఇది కచ్చితంగా రాజ్యాంగానికి మార్చేందుకు చేస్తున్న ప్రయత్నమే. ఈ పదాలు 1976లో చేర్చారన్న విషయం నాకు తెలుసు. రాజ్యాంగ ప్రతిని ఈరోజు ఎవరైనా ఇచ్చారంటే.. అది తాజా వెర్షన్ అయి ఉండాలి. ఇది అత్యంత తీవ్రమైన విషయం. దీన్ని కచ్చితంగా లేవనెత్తుతాం."
-అధీర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ సైతం ఈ విషయంపై స్పందించారు. రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు కనిపించడం లేదని చెప్పారు. మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై బీజేపీ సర్కారు లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. 'ఇదెలా జరుగుతుంది? మనసులో ఏది ఉంటే.. అదే మన చేతల్లో కనిపిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగ పీఠికను మార్చేశారు. చాలా ముఖ్యమైన సోషలిస్ట్, సెక్యులర్ పదాలను కనిపించకుండా చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన స్పష్టమైన సందేశమిది. ఇది దురదృష్టకరం' అని కేసీ వేణుగోపాల్ అన్నారు. సీపీఐ నేత బినోయ్ విశ్వం సైతం ఈ రెండు పదాలను విస్మరించడంపై తీవ్రంగా స్పందించారు. వాటిని లేకుండా రాజ్యాంగ కాపీలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. ఇది నేరపూరిత చర్య అని విమర్శించారు.