రెండో దశలో కొవిడ్ మహమ్మారి పల్లెలకూ వ్యాపించింది. మే నెలలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. అయితే.. కొవిడ్-19 రెండో దశ భారత వ్యవసాయ రంగంపై ఏ విధంగానూ ప్రభావం చూపదని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చంద్. భారత్ అవలంబిస్తున్న రాయితీ, ధర, సాంకేతిక విధానాలు.. వరి, గోధుమ, పంచదార పంటలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయన్నారు. అలాగే.. పప్పు దినుసులకు కనీస మద్దతు ధర, కొనుగోలు విధానాలను తీసుకురావాల్సి ఉందని సూచించారు.
"మే నెలలో కొవిడ్-19 గ్రామీణ ప్రాంతాలకు వ్యాప్తి చెందటం మొదలైంది. మే నెలలో వ్యవసాయ పనులు తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా భూమి ఆధారిత పనులు. ఈ నెలలోనే ఎండలు మండిపోతాయి. ఈ సమయంలో ఎలాంటి పంట పండదు. చిన్నపాటి కూరగాయలు, సీజనల్ పంటలు తప్ప ఇతర ప్రధాన పంటలు పండించరు. మార్చి లేదా ఏప్రిల్ అర్ధభాగంలో పంటలు అధికంగా సాగవుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గి.. మళ్లీ వర్షకాలంలో ప్రారంభమవుతాయి. మే నుంచి జూన్ అర్ధభాగం వరకు కూలీల కొరత ఉన్నప్పటికీ.. వ్యవసాయంపై కరోనా ఏ విధంగానూ ప్రభావం చూపదని నా ఆలోచన. "