School Teacher Kidnapped Forced To Marry In Bihar : ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి.. సినిమా స్టైల్లో తన కుమార్తె మెడలో బలవంతంగా తాళి కట్టించాడు కిడ్నాపర్. ఈ ఘటన బిహార్‌లోని వైశాలిలో జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు.. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వైశాలి జిల్లాకు చెందిన గౌతమ్ కుమార్.. ఇటీవలే బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అర్హత సాధించి పటేపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నవంబర్ 29వ తేదీ మధ్యాహ్నం కారులో నలుగురు వ్యక్తులు వచ్చి.. గౌతమ్‌ను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రాజేశ్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో రాజేశ్‌రాయ్.. తన కుమార్తె చాందినీని పెళ్లి చేసుకోవాల్సిందిగా గౌతమ్‌ను కోరాడని, అతడు తిరస్కరించడం వల్ల భౌతికదాడి కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. గౌతమ్ జాడను తెలుసుకున్న పోలీసులు వెళ్లి చూసే సరికి.. గౌతమ్, చాందినీల వివాహం జరిగిపోయింది. రాజేశ్.. వధూవరులిద్దరినీ తన ఇంట్లోనే బంధించాడు. పోలీసులు రాజేశ్, అతడి కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు.