యుక్తవయసులో సహజీవనం చేస్తూ శృంగారంలో పాల్గొనే వారిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించాలా? వద్దా? అనే అంశంపై తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది.
ఓ యువకుడితో ఏకాభిప్రాయంతోనే సహజీవనం చేసినట్టు స్పష్టం చేసినప్పటికీ.. యువతి వాదనలను మద్రాసు హైకోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.
ఇదీ జరిగింది..
తమిళనాడుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. కానీ వివాహానికి నిరాకరించడం వల్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకునిపై అత్యాచారం కేసు నమోదైంది.
అయితే విచారణ సందర్భంగా.. తనపై అత్యాచారం జరగలేదని, ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నట్లు యువతి వెల్లడించింది. తిరిగి ఆ యువకునితో సహజీవనం కొనసాగించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది.